రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కేటీఆర్‌కు మరో ప్రశంస దక్కింది. ప్రపంచం చూపును తనవైపు తిప్పుకున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ విషయంలో తాజాగా మరో కితాబు దక్కింది. హైదరాబాద్ వేదికగా గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ సదస్సును అద్భుతంగా నిర్వహించినందుకు అమెరికా అంబాసిడర్ కెన్నెత్ ఐ.జస్టర్ మంత్రి కేటీఆర్ పై ప్రశంసలు కురిపించారు. సదస్సు సందర్భంగా మంత్రి కేటీఆర్ ను కలిసే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు అమెరికా రాయబారి కెన్నెత్ మంత్రి కేటీఆర్ కు లేఖ రాశారు.
గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ సమ్మిట్‌ను విజయవంతమైనందుకు మంత్రి కేటీఆర్‌కు అమెరికా రాయబారి లేఖలో శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అత్యద్భుతంగా ఏర్పాట్లు చేయడం వల్లే సదస్సు అర్థవంతంగా సాగిందని కితాబిచ్చారు. తెలంగాణను టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్ గా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు అద్భుతమని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్ట్ మెంట్ పాలసీలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అమెరికా అంబాసిడర్ కెన్నెత్ ఐ.జస్టర్ పేర్కొన్నారు.