సిటీజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్నితెలంగాణ రాష్ట్రమంతటా విస్తరింపజేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు . 2017 పోలీసు శాఖ ప్రగతిని మీడియాకు అయన వెల్లడించారు. వ్యవస్థీకృత నేరాల కట్టడిలో రాష్ట్ర పోలీసుశాఖ మొదటి స్థానంలో ఉందని అయన స్పష్టం చేశారు. హైదరాబాద్ తరహా పోలీసింగ్ ను రాష్ట్రమంతటా విస్తరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
దేశంలోనే తెలంగాణ పోలీసు శాఖకు మంచి పేరుందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. జీఈఎస్, ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పని చేస్తున్నామని తెలిపారు. 2018లో 8 ముఖ్యమైన లక్ష్యాలను పెట్టుకున్నామని చెప్పారు. 2018 పోలీసు శాఖకు ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అని డీజీపీ పేర్కొన్నారు.క్రైం రేటును తగ్గించడంతో పాటు.. నేరం చేసిన వారిని త్వరగా పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని చెప్పారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నేను సైతం కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టుకు విశేష స్పందన వస్తోందన్నారు.ప్రతీ పోలీసు స్టేషన్‌కు ఫేస్‌బుక్ పేజీ, ట్వీట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తామన్నారు. దీని ద్వారా ఫీడ్ బ్యాక్ తెలుసుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు. ప్రతీ కమిషనరేట్ పరిధిలో మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. వీటన్నింటిని బంజారాహిల్స్‌లోని ప్రధాన కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తామని ప్రకటించారు.రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే తమ లక్ష్యమని డీజీపీ స్పష్టం చేశారు.