ఆపన్నులకు సహాయం చేయడంలో ముందుండే తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు తన పెద్ద మనసును చాటుకున్నారు. సహాయం కోరుతూ ట్వీట్ చేసిన వెంటనే స్పందించి ప్రాణం నిలిపేలా చేశారు. ఓ చిన్నారి సహా మహిళకు కావాల్సిన సహాయం చేయడంలో తక్షణం స్పందించారు. రెండేండ్ల వయస్సున్న ఓ చిన్నారికి అత్యవసర వైద్య సేవలు అందించాల్సి ఉంది. ఆయన కుటుంబ సభ్యులకు ఆర్థిక స్థోమత లేకపోవడాన్ని జువ్వాడి వినాయక్‌రావ్ అనే ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. పేదరికంలో ఉన్న ఆ దళిత కుటుంబం ఇప్పటికే రూ.లక్షన్నరకు పైగా ఖర్చుచేసిందని పేర్కొంటూ సహాయంగా కోరగా మంత్రి కేటీఆర్ తన కార్యాలయ సిబ్బందితో తక్షణం వివరాలు తీసుకునేలా చేసిన సహాయం అందించారు.
కాగా, నవీన్ అనే ఓ నెటిజన్ తన తల్లి బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆస్పత్రి పాలయిందని…ఇప్పటికే ఆమె ఆరోగ్యాన్ని బాగు చేసేందుకు రూ. 5 లక్షలకు పైగా ఖర్చు చేశామని…ఆమె కోలుకుంటున్న సమయంలో మరింత సొమ్ము కావాల్సి ఉందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆయనకు తగు సహాయం అందించాలని మంత్రి కేటీఆర్ తన బృందానికి సూచించారు.