తెలంగాణ కుంభమేళాగా పిలిచే శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత భారీ ఏర్పాట్లు చేస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరగనుంది. ఇప్పటికే జాతర నిర్వహణకు 80.55 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో కొద్ది నెలలుగా 20 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పనులు సాగుతున్నాయి. వీటిని ఈనెల 15 లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు గడువు విధించింది. మరోవైపు భద్రతపై దృష్టి సారించింది. పెద్ద ఎత్తున భక్తజనం హాజరుతో…మేడారంలో అమ్మవార్లను దర్శించుకునే సమయంలో గద్దెల దగ్గర, క్యూలైన్ల దగ్గర తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకుంటున్నాయి. వీటి నివారణకు మొదటి సారి పోలీస్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. ఈ మేరకు మహా జాతర జరిగే మేడారం పరిసరాల్లో అందుబాటులో ఉన్న క్రౌడ్ డిటెక్షన్, కౌంటింగ్, పార్కింగ్ కెమెరాలు, సీసీ కెమెరాలను అమర్చనుంది. క్యూలైన్లలో, అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలోకి ప్రవేశించే, బయటకు వెళ్లే భక్తులను లెక్కించి , రద్దీని గుర్తించే క్రౌడ్ డిటెక్షన్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
అమ్మవార్ల గద్దెల ప్రాంగణం. దర్శనం కోసం రెండు వైపులా ఉన్న క్యూలైన్లు, ఆర్టీసీ కాంప్లెక్స్ తోపాటు మేడారంలోని వై జంక్షన్, జంపన్న వాగు దగ్గర ఉన్న స్నానపు గట్టాల దగ్గర 10 డిటెక్షన్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. మహా జాతర జరిగే పరిసరాల్లో 150 సిసీ కెమెరాలను అమర్చుతున్నారు.ఈ కెమెరాలను అనుసంధానం చేసేందుకు మేడారంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తోంది.కంట్రోల్ రూం ద్వారా అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తారు. భద్రత కోసం మేడారం పరిసరాల్లో ఇప్పటికే డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు.మహా జాతరలో ట్రాఫిక్ నియంత్రణ, తోపులాట, తొక్కిసలాట వంటివి చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం పోలీసుకు పెను సవాల్. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలన్నీ కూడా 163వ జాతీయ రహదారిలో పస్రా వరకు కలిసే రావాల్సి ఉన్నందున ఈ రహదారిలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు విధులు నిర్వహించాల్సి ఉంది. పస్రా నుంచి 25 కిలో మీటర్ల దూరంలో నార్లపూర్ వరకు రహదారి పొడవునా ఇరువైపులా ప్రతి జాతర సమయంలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తారు. ఈ పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిన సమయంలో భక్తులు ఇబ్బందులు పడుతుండటమే కాకుండా వాహనాల రాకపోకలకూ అంతరాయం ఏర్పడుతోంది.
ఈ నేపథ్యంలో పోలీసులు, ఈసారి పస్రా-నార్లాపూర్ రూట్ లో ఉన్న ప్రతీ పార్కింగ్ వద్ద వాహనానలు లోపలికి, బయటకు వెళ్తే ద్వారా వద్ద పార్కింగ్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాల ఏర్పాటతో ఆయా పార్కింగ్ స్థలాల్లో ప్రవేశించిన వాహనాలు ఎన్ని, వీటిలో బయటకు వెళ్లినవి ఎన్ని అనేది తెలుసుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.ట్రాఫిక్ నియంత్రణకు ప్రైవేటు వాహనాలు నడిచే రూట్ లో భక్తులకు సూచనలు చేయడానికి బోర్డుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈసారి వన్ వే పద్దతిని అమలు చేయనున్నారు. అలాగే మేడారం జాతరకు సంబంధించిన ఏర్పాట్లు, సౌకర్యాలు ఇతర సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను తయారు చేస్తున్నారు.మరోవైపు మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు నాలుగు వేల బస్సులను నడుపాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రంలోని 50 కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపాలని నిర్ణయించారు. ఈ సారి జాతర సమయంలో 10 లక్షల నుంచి 12 లక్షల మంది ఆర్టీసీ సేవలు ఉపయోగించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్, హన్మకొండ, కాజీపేటతో పాటు కరీంనగర్, మంచిర్యాల, గోదావరిఖని, పెద్దపల్లి తదితర 50 కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు.