స్వరాష్ట్రం కోసం పోరాడిన నాటి ఆకాంక్షలన్నీ తెలంగాణ రాష్ట్రంలో నెరవేరుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నల్లగండ్ల రేడియల్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ రేడియల్ రోడ్లు పూర్తయితే హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటిస్తున్నామో అది సాధ్యం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో కరెంట్ సమస్యను అధిగమించారని అదే రీతిలో మిగతా అంశాలకు సైతం పరిష్కారం చూపుతున్నారని చెరు. రూ.350 కోట్ల రూపాయలతో రోడ్స్ నిర్మాణం చేపడుతున్నామన్నారు.
ఉద్యమ సమయంలో ఏ కలలు కన్నామో ఇప్పుడు అవి ఆచరణ రూపంలో జరుగుతున్నాయని మంత్రి తుమ్మల అన్నారు. గతంలో ఎవరు చెయ్యలేని సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి చేస్తున్నారని తెలిపారు. అధికారం కోల్పోయిన పెద్ద మనుషులు ఏవేవో మాట్లాడుతున్నారని కానీ…ముందు చూపుతో 24 గంటల పవర్ రైతులకు ఇస్తున్న ఘనత మన ముఖ్యమంత్రిదని ప్రశంసించారు.
మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లా ప్రాంతంలో కోట్లాది నిధులతో అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు. రింగ్ రోడ్డు లోపలి ఆవాసాలలో రూ. 1900 కోట్లతో మంచినీటి సమస్య శాశ్వతంగా నివారించడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. మెట్రో రైలుకు అనుసంధానం గా ఆర్టీసీ బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.