కాళేశ్వరం ప్రాజెక్టును డెడ్లైన్ లోగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ సరఫరా లైన్ల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. సుందిళ్ళ,మేడిగడ్డ,అన్నారం పంపు హౌజ్ ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.400 కే.వి,220 కే.వి.లైన్ల పనులు ప్రారంభించారు. జెట్ స్పీడులో పంపు హౌజ్ పనుల నిర్మాణం జరుగుతోంది. 2018 జూన్ కల్లా 8 పంపులు రెడీ అవుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వ ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి తెలిపారు.
డెడ్ లైన్ లోగా కాళేశ్వరం కు విద్యుత్ సరఫరా చేయడానికి ట్రాన్స్ కో అధికార యంత్రాంగం సకల ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. వచ్చే వానాకాలం నాటికి కాళేశ్వరం పంపింగ్ స్టేషన్లు పని చేయనున్నందున విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లు వేగవంతం చేయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. డెడ్ లైన్ లోపే విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం, పంపిణీ లైన్ల ఏర్పాట్లు పూర్తి చేస్తామని ట్రాన్స్ కో ఉన్నతాధికారులు తెలిపారు. విద్యుత్, ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీశ్ రావు ట్రాన్స్మిషన్ లైన్లు,సబ్ స్టేషన్ల పనులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.కాళేశ్వరం పంపు హౌజ్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నందున విద్యుత్ సంస్థలు తమ పనులను మరింత వేగవంతం చేయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఇదివరకే కోరారు.
ప్యాకేజిల వారీగా పంపింగ్ స్టేషన్ లను పూర్తికీ గాను టార్గెట్ పెట్టుకొని ఇరిగేషన్ శాఖ పని చేస్తున్నది. కాళేశ్వరం ప్యాకేజీ 6 కు సంబంధించిన 3 పంపులు, ప్యాకేజి 8 కి చెందిన 5 పంపులు జూన్ వరకు సిద్ధమవుతాయని పెంటారెడ్డి తెలియజేశారు. మేడిగడ్డ,సుందిళ్ళ,అన్నారం
బ్యారేజీల పరిధిలోని పంపు హౌజ్ ల నిర్మాణానికి అవసరమైన విద్యుత్ సరఫరా అంశాలపై మంత్రి ట్రాన్స్ కో, జెన్ కో అధికారులతో నిరంతరం చర్చిస్తున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన, షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేందుకు విద్యుత్ సంస్థల సహకారం, తోడ్పాటు అవసరమని మంత్రి అభిప్రాయపడుతున్నారు. అయితే త్వరితగతిన విద్యుత్ సబ్ స్టేషన్ల టెస్టు పూర్తి చేయాలన్నారు.