గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తండా వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతి భవన్‌కు వచ్చిన గిరిజన తండావాసులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.. గిరిజనులకు ప్రత్యేకమైన జీవన శైలి, భాష ఉందన్నారు. ఆయా వర్గాల మధ్య వేషధారణ, వివాహాలు, పండుగలు, దేవతారాధన.. ఇలా అన్నింటిలోనూ తేడా ఉందన్నారు. ‘‘విశాల భారతదేశంలో ఉన్న అనేక జాతులు తమ సంప్రదాయ సంస్కృతులను, జీవన శైలిని కాపాడుకుంటాయి. సమాజం నవీనతవైపు వెళ్తున్నా పాత వాటిని ఏ సమాజమూ కోల్పోదు. తండాలను అద్దాల్లా తీర్చిదిద్దాలి. తెలంగాణ రాష్ట్రంలోనే ఇంచుమించు 3వేల గిరిజన గ్రామాలు పంచాయతీలుగా ఉండే అవకాశం ఉంది. ఇది ఉమ్మడి ఏపీలోనూ లేదు. ప్రభుత్వం నుంచి, నరేగా నుంచి, కేంద్రం నుంచి కూడా ఏడాదికి కనీసం రూ.20లక్షలు వస్తాయి. నేరుగా తండాకు వచ్చే ఈ డబ్బుతో అద్దాల్లాగా తీర్చిదిద్దే బాధ్యతను పెద్దలు తీసుకోవాలి. ఇవన్నీ సాధించుకున్న నాడే ఈ బిల్లుకు సార్థకత చేకూరుతుంది.
గిరిజన తండాల్లో విద్యుత్ సమస్య ఇక ఉండదు. మిషన్ భగీరథ వస్తోంది గనుక నీటి సమస్య తీరుతుంది. ఎక్కువ శాతం గిరిజనులు ఉండే రాష్ట్రం మనది. ఏ పార్టీ వాళ్లు అధికారంలో ఉన్నా ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు వస్తాయి. ఆ ఉప ప్రణాళిక కింద రూ.50 వేల కోట్లు వస్తాయి. ఐదేళ్లలో రూ.35వేల కోట్లు ఖర్చుపెడితే గిరిజన తండాల్లో అసలు పేదరికమే ఉండదు. గిరిజనులు ఎప్పుడూ పేదరికంలోనే ఎందుకు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో వారిలో పేదరికం ఉండొద్దు. చదువుకున్నవాళ్లు, అవగాహన ఉన్నవాళ్లు బాధ్యత తీసుకొని వారి అభ్యున్నతికి పాటుపడాలి. చిన్నారులంతా చదువుకోవాలి. ఆయా గ్రామాలకు సంబంధించిన లెక్కాపత్రం రాసే బాధ్యత సర్పంచ్ తీసుకోవాలి. గిరిజనుల జనాభా, అప్పులు, ఆస్తులు, భూములు తదితర డేటా అంతా గ్రామాల వారీగా సేకరించి ప్రభుత్వం ముందు పెట్టాలి. వాటి ఆధారంగా బడ్జెట్ ప్రవేశపెట్టాలి. ఐదారేళ్లలోనే ధనవంతులుగా ఉన్న గిరిజనులు తెలంగాణాలో ఉన్నారనే చర్చ జరగాలి. అప్పుడే బిల్లు, కొత్త రాష్ట్ర ఏర్పాటుకు సార్థకత చేకూరుతుంది. లేకపోతే ఏం లాభం?
రాజ్యం మీ చేతుల్లోనే.. డబ్బులు మీ చేతుల్లోనే.. మీకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది. మీరు అనుకున్నది సాధించుకుని ఫలితాలు రాబెట్టుకొనే అవకాశం ఉంది. ఉన్న అవకాశాలను వినియోగించుకోకపోతే తప్పు మీదే అవుతుంది. ఇంకొకరిది కాదు. ఏ వూరికావూరులోనే ఏం చేయాలనే నిర్ణయం మీరే చేయాలి. మనం బాగుపడాలంటే ఎవరో వచ్చి సాయం చేయరు. మనం ఎప్పుడైతే మేల్కొంటామో అప్పుడే బాగుపడతాం. తెలంగాణ వస్తదని ఎవరైనా అనుకున్నారా? నేను బయల్దేరితే భయపెట్టారు. కొట్లాడితే వచ్చింది కదా. ఈ రోజు తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయి కదా!’’ అని సీఎం కేసీఆర్ వివరించారు. కార్యక్రమంలో ఎంపీలు సీతారామ్‌నాయక్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.