వచ్చే నెల 10 నాటికి పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను ప్రకటించేందుకు పంచాయతీరాజ్ శాఖ సిద్దమౌతోంది. ఈ నెలాఖరులోగా బీసీ ఓటర్ల గణనను పూర్తి చేసి… వచ్చే నెల 10 లోపు సర్పంచ్, వార్డు స్థానాల రిజర్వేషన్లను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, హరితహారం, ఎల్ ఈ డీ వీధి దీపాల ఏర్పాటు తదితర అంశాలపై తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, ఇతర అధికారులతో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం సమీక్ష నిర్వహించారు. 2011 గ్రామీణ జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు అధికారులు వివరించారు. అలాగే ప్రస్తుతం బీసీ ఓటర్ల గణన జరుగుతుందని, నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 10 నాటికి జిల్లాలవారీగా సర్పంచ్ స్థానాల రిజర్వేషన్ల సంఖ్యను రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ కమిషనర్, వార్డుమెంబర్ల సంఖ్యను జిల్లా స్థాయిలో మండలాలవారీగా కలెక్టర్లు ఖరారు చేయనున్నారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.
పంచాయతీరాజ్ నూతన చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో నర్సరీల ఏర్పాటు పంచాయతీల బాధ్యతని…ఆ దిశగా కార్యాచరణ సిద్దం చేసుకోవాలని అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు. జూన్ 10 లోగా నర్సరీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని… జులై 15 నాటికి నర్సరీల ఏర్పాటు పూర్తి కావాలన్నారు. ఇప్పటికే దాదాపు 3 వేలకు పైగా గ్రామాల్లో నర్సరీలున్నాయని…మిగిలిన గ్రామాల్లోనూ వెంటనే స్థల సేకరణ చేసి నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెయ్యికి పైగా జనాభా ఉంటే లక్ష మొక్కలతో… వెయ్యి కన్నా తక్కువ జనాభా ఉంటే 50 వేల మొక్కలతో నర్సరీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు రామారావు, సుధాకర్, వెస్లీ, ఆశా తదితరులు పాల్గొన్నారు.