సామాన్యుల వైద్య సేవల్లో కీలక ముందడుగు పడింది. రూ.40 కోట్లతో అడ్వాన్డ్ వైద్య సేవలు అందించేందు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే మొదటి సారిగా సర్కార్ దవాఖానాల రంగంలో గాంధీ దవాఖానాలో అవుట్ పేషంట్ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ని ఏర్పాటు చేయగా, దానిని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని నిరుపేదలకు కూడా ఉచితంగా నాణ్యమైన, అధునాతన వైద్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆ లక్ష్యం దిశగానే సర్కార్ దవాఖానాలను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, అత్యంత నిరుపేద, సామాన్యులకు కూడా అధునాత వైద్యం అందాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. అందుకే సీఎం కెసిఆర్ సూచనలు, మార్గనిర్దేశనంలో సర్కార్ దవాఖానాలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పరిచామని చెప్పారు. గాంధీలో కొత్తగా అవయవ మార్పిడి థియేటర్లను రూ.40 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. గాంధీని అవయవ మార్పిడులకు కేరాఫ్ అడ్రస్‌గా తీర్చిదిద్దుతామన్నారు. అత్యంత అధునికమైన మాడ్యులర్ థియేటర్లను అంతర్జాతీయ, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయనున్నామని మంత్రి తెలిపారు. దీంతో గాంధీలోనే దశంలోనే అరుదైన, అవయవ మార్పిడులు జరిగే విధంగా చేస్తామన్నారు. ఈ విధంగా అనేక మంతి ప్రాణాలు నిలిపే అవకాశం ఉంటుందని చెప్పారు.
అలాగే, రూ.26 కోట్లతో రాష్ట్రంలోని మార్చురీల అభివృద్ధి పరుస్తామని మంత్రి తెలిపారు. ఇప్పటికే గాంధీలో మార్చురీల ను అభివృద్ధి పరిచామన్నారు. అయితే ప్రస్తుత అవసరాలకు మించి, సెంట్రలైజ్‌డ్ గా, ఫ్రీజర్స్, పఫ్స్‌తో కూడిన అధునాత మార్చురీల ద్వారా ఎలాంటి దుర్వాసన లేని, ఎవరైనా సరే, అక్కడ ఉండగలిగే విధంగా తీర్చిదిద్దుతామని మంత్రి చెప్పారు. ఇక రూ.4.5 కోట్లతో ఉస్మానియా మార్చురీ ఆధునీకరిస్తున్నామని కొత్త భవనాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు.
తాజాగా గాంధీలో ఏర్పాటు చేసిన అవుట్ పేషంట్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ దేశంలోనే మొదటిదన్నారు. ప్రభుత్వ రంగంలో దేశంలో ఎక్కడా ఇలాంటి ఏర్పాటు జరగలేదన్నారు. అనేక ప్రాంతాల నుంచి ప్రభుత్వ దవాఖానాలకు వచ్చే పేషంట్లకు రోగ నిర్ధారణ పరీక్షలు ఓ పరీక్షగా మారుతున్నాయన్నారు. ఒకే చోట పరీక్షలు నిర్వహించే విధంగా, గంటకు వెయ్యికి మించి పరీక్షలు జరిగే అధునాత పరికరాలను అమర్చామన్నారు. అలాగే రక్తనమూనాల కలెక్షన్ కేంద్రాన్ని కూడా ప్రారంభించామని మంత్రి వివరించారు.
ఇప్పటికే గాంధీ దవాఖానాను అనేక విధాలుగా ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని, అధునాతన వసతులు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. 65 బెడెడ్ ఐసియుని ఏర్పాటు చేశామని, దేశంలో ఎక్కడా లేని విధంగా మానవతా దృక్పథంతో ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్ని ప్రారంభించామన్నారు. అలాగే పేట్ల బురుజులోనూ ఏర్పాటు చేస్తామని దశల వారీగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల హాస్పిటల్స్‌కి కూడా వీటిని పెడతామన్నారు. ఇక గాంధీకి ఇప్పటికే 60 బెడెడ్ క్యాజువాలిటీ ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న వాటికి తోడుగా, ఎంఆర్ఐ, సిటి స్కాన్ మిషన్లు కూడా పెడుతున్నామన్నారు. దేశంలోనే వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపి బంగారు తెలంగాణలో ఆరోగ్య తెలంగాణ సాధిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.