అభివృద్ధి, పర్యావరణ ఏకకాలంలో సమాజహితం కోసం సాగాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. సమాజహితానికి ఉపయోగపడని అభివృద్ధి నష్టదాయకమన్నారు. పఠాన్‌చెరు మండలం పాషామైలారంలోని ఇండస్ట్రీయల్ ఏరియాలో మౌలిక సదుపాయాల కల్పన ,పారిశ్రామిక వ్యర్థజలాల శుద్దికరణ కేంద్రంకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటు విషయంలో పోటీ వాతావరణం నెలకొందని అన్నారు. రాష్ట్రాలు మన దగ్గర పరిశ్రమలు నెలకొల్పేందుకు పోటీ పడుతున్నాయని తెలిపారు. ఇక్కడ ఎప్పటి నుండో పరిశ్రమలు ఏర్పాటు చేశారని, దీనివల్ల మనకు పరోక్షంగా ,ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు.
`పరిశ్రమలు నెలకొల్పండి కానీ పర్యావరణహిత పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలి` అని మన ముఖ్యమంత్రి గారు మాకు ఎప్పుడు చెప్తారు అని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. `ఈ ప్రాంతం అంతా కాలుష్యంతో నిండిపోయింది. బోర్ వేస్తే కూడా డికాషన్ లాగా నీళ్లు వస్తాయి అని ఎమ్మెల్యే చెప్పారు . నీళ్లు ఒక్కటే కాదు, గాలి కూడా కాలుష్యం అయింది.
నేను మంత్రి అయ్యాక స్వయంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో పరిశ్రమల యజమానులతో చర్చలు జరిపి కాలుష్యం కాకుండా చూడాలి అని వారిని గట్టిగానే హెచ్చరించాం.
13 కంపెనీలను మూసివేయించాం. అందుకే కంపెనీల యజమానులు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకోవాలి“ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ చుట్టూ ఉండే పరిశ్రమలను హైదరాబాద్‌కు దూరంగా తరలిస్తామని లేదంటే వాటి దగ్గర వ్యర్ధాల శుద్దికరణ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
`కాలుష్యాన్ని సహించేది లేదు. ఇక్కడ ఉన్న అన్ని పరిశ్రమల ద్వారా వచ్చే వ్యర్ధాలను ఇక్కడే శుద్ధి చేసుకునే విదంగా శంకుస్థాపన చేసుకోవచ్చు. గత ప్రభుత్వాలు జీఓలు ఇచ్చారు కానీ చేసి చూపించలేదు. హైదరాబాద్ నుండి అవతలకు పరిశ్రమలు తరలించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నాం. హైదరాబాద్ ఫార్మా సిటీలో కూడా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చాక తరలిస్తాం. భవిష్యత్తు తరాలను గుర్తు పెట్టుకొని పని చేసే ప్రభుత్వం మా ప్రభుత్వం`అని ఆయన తెలిపారు.