పంచాయితీ రాజ్ సంస్థల్లో ప్రజాప్రతినిధుల ఎన్నికలకు కేటాయించే రిజర్వేషన్ 50 శాతం దాటవద్దని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. పంచాయితీ రాజ్ సంస్థల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా తెలంగాణలో మొత్తం 61 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను పునరుద్ధరించాలని కోరాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీనికోసం అవసరమైన కసరత్తు చేసి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి బుధవారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కావాలని సిఎం ఆదేశించారు.
అడిషనల్ అడ్వకేట్ జనరల్ తో పాటు ఇతర సంబంధిత అధికారులను కూడా ఈ సమావేశానికి పిలిచి, అన్ని విషయాలను కూలంకశంగా చర్చించి, పూర్వాపరాలను సమగ్రంగా పరిశీలించి, తెలంగాణలోని పంచాయితీ రాజ్ సంస్థల్లో 61 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పేవిధంగా వాదనలు ఖరారు చేయాలని సిఎం కోరారు. బిసిలకు 34 శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ తమ పార్టీ సర్పంచ్ స్వప్నా రెడ్డి ద్వారా హైకోర్టులో పిటిషన్ వేయించి, కాంగ్రెస్ పార్టీ బిసిల రిజర్వేషన్లకు గండి కొట్టిందని సిఎం విమర్శించారు. బిసిలకు 34 శాతం రిజర్వేషన్ కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, ఇందుకు అవసరమైన న్యాయ పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.