పర్యావరణ రక్షణకు, మెరుగైన జీవన విధానం కోసం తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన అన్ని కార్యాక్రమాలకు మద్దతు పెరుగుతోంది. హరితహారం పేరుతో ఆకుపచ్చ తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి పెటాప్సీ గవర్నింగ్ బాడీ ప్రతినిధులు తమ సంపూర్ణ మద్దుతు ప్రకటించారు. పరిశ్రమల ద్వారా వాణిజ్యం చేస్తున్న తాము సమాజం నుంచి మేలుపొందామని ఇప్పుడు అదే సమాజానికి సామాజిక బాధ్యతలో భాగంగా తోడ్పాటునందిస్తామని వెల్లడించారు.
నాలుగో విడత హరితహారంపై అరణ్య భవన్ లో కీలక సమావేశం జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులతో సీ.ఎం కార్యాలయంతో పాటు, అటవీ శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఫెడరేషన్ లో సభ్యులుగా ఉన్న పరిశ్రమలు, పారిశ్రామిక ప్రాంతాలు, రెసిడెన్షియల్ కాలనీల్లో హరితహారం చేపట్టడంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఆకుపచ్చని తెలంగాణ దిశగా ముఖ్యమంత్రి చొరవను పారిశ్రామికవేత్తలు ప్రశంసించారు. కాలుష్యానికి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ తో పాటు, శివారు ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడల్లో విరివిగా మొక్కల పెంపకం చేపట్టేందుకు సంసిద్దత వ్యక్తం చేశారు. ఢిల్లీతో పాటు ఇతర ప్రధాన పట్టణాల్లో వాయు కాలుష్యం, తద్వారా పెరుగుతున్న శ్వాస సంబంధిత వ్యాధుల నివారణకు పచ్చని ప్రకృతిని కాపాడుకోవటమే మార్గమని ఫాట్ ప్సీ అధ్యక్షుడు అరుణ్ లుహారుక తెలపారు. ఈ దిశగా ప్రభుత్వం హరితహారంలో భాగంగా తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని, ఫెడరేషన్ తరపున అన్ని విధాలా సహకరించటంతో పాటు సంవత్సరం పాటు ప్రతీ నెలా వెలువడే ఫాట్ ప్సీ మ్యాగజైన్ లో అటవీ శాఖ కోసం ఒక పేజీని కేటాయిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ కోసం తీసుకుంటున్న చర్యలను ప్రతీ నెలా తమ పారిశ్రామిక సభ్యులకు చేరేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.
హరితహారంతో పాటు అర్బన్ ఫారెస్ట్ పార్కులు, అటవీ పునరుజ్జీవన చర్యలు, ఎకో టూరిజం ప్రాంతాల అభివృద్ది, అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల అనర్థాలను పీసీసీఎఫ్ పీ.కే. ఝా సమావేశంలో వివరించారు. అత్యంత విలువైన అటవీ, వణ్యప్రాణి సంపదను కాపాడుకోవటంలో పారిశ్రామిక రంగం సహకరించాలని కోరారు. హరితహారంలో భాగంగా కొన్ని ప్రాంతాలను దత్తత తీసుకుని మొక్కలు పెంచటం, ట్రీ గార్డులను స్పాన్సర్ చేయటం, నీటి వసతి కల్పించటం, అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, జూ పార్క్ లో మరింత మెరుగైన సౌకర్యాలకు సహకరించాలని కోరారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఇటీవల తీసుకున్న పర్యావరణహిత చర్యలను అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్ వివరించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు నల్లమలకు అతిపెద్ద ప్రమాదకారిగా ఉన్న విషయాన్ని వెల్లడించారు. స్పందించిన గవర్నింగ్ బాడీ సభ్యుడు అనిల్ రెడ్డి నల్లమలతో పాటు అటవీప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ కోసం కాటన్ బ్యాగులను ఫాట్ ఫ్సీ తరపున సరఫరాకు, అలాగే అక్కడ పోగవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ కోసం ప్రత్యేకంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఫాట్ ప్సీ ప్రతినిధుల బృందం ప్రత్యేకంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో పర్యటించాలని అధికారులు కోరటంతో వారు అంగీకరించారు.