ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రత విషయంలో ప్రభుత్వం, ప్రైవేట్ యాజమాన్యాలు కలిసి పనిచేయాలని, విద్యార్థుల భద్రతలో రాజీపడేది ఉండదని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలలో వివిధ సమస్యలపై నేడు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్, ఎస్సీ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నేడు మర్రి చెన్నా రెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగింది. ఈ సమావేశంలో విద్యా సంస్థల అనుమతులు, గుర్తింపు, ఫీజు రియింబర్స్ మెంట్ చెల్లింపులో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. అదే సమయంలో ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థుల భద్రతలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ప్రైవేట్ విద్యా సంస్థల్లో అగ్నిమాపక చర్యలు పాటించడంలో విద్యార్థుల భద్రత చూడాలని, కచ్చితంగా ఫైర్ ఎగ్జిట్ ఏర్పాటు చేయాలని, అగ్నిమాపక వస్తువులు బిగించాలని సమావేశంలో మంత్రులు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు స్పష్టం చేసింది. అయితే జాతీయ అగ్నిమాపక నిబంధనలు రాకముందు ఏర్పాటైన పాఠశాలల భవనాలకు అగ్నిమాపక నిబంధనలు వర్తింపచేయడంలో ఎలాంటి వెసులుబాటు కల్పించాలనేదానిపై కమిటీ వేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.
పాఠశాలలకు ఆస్తిపన్నును తగ్గించాలన్న యాజమాన్యాల విజ్ణప్తిని మంత్రులు అంగీకరించి, ప్రత్యేక స్లాబులో ఆస్తిపన్ను వసూలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక స్లాబ్ అమలులో ఉందన్నారు.
ఫీజు రియింబర్స్ మెంట్ చెల్లింపులో డిగ్రీ, జూనియర్ కాలేజీలకు సరైన న్యాయం జరగడం లేదని యాజమాన్యాలు మంత్రులకు వివరించారు. ఎక్కువ మంది విద్యార్థులు ఈ డిగ్రీ, జూనియర్ కాలేజీలలో ఉన్నా రియింబర్స్ మెంట్ తక్కువే అవసరమవుతుందని, అందుకే ప్రత్యేక పద్దు ద్వారా తమకు చెల్లించే విధానం చూడాలని కోరారు. దీనికి అంగీకరించిన మంత్రులు విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య చైర్ పర్సన్ గా ఆర్ధిక శాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్యదర్శులు సభ్యులుగా కమిటీ వేసి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.
ఇక కాలేజీలు, పాఠశాలలకు అనుమతులు ఇవ్వడంలో నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్.ఓ.సీ)లు జారీ చేయడంలో చాలా ఇబ్బందులున్నాయని యాజమాన్యాలు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారని, ఎన్.ఓ.సీల జారీని వికేంద్రీకరణ చేసే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు.ప్రైవేట్ కాలేజీలు, పాఠశాలలపై ప్రభుత్వానికి కక్షసాధింపు ధోరణి లేదని, అయితే ప్రభుత్వ విద్యా సంస్థలను పటిష్టం చేసే ప్రయత్నం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలు రెండు మంచి నాణ్యత కలిగిన విద్యను అందించాలని చెప్పారు.
హాస్టళ్లకు అనుమతులు తీసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు అంగీకరించాయని, ప్రభుత్వ నిబంధనలకు లోబడే ఎవరైనా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ప్రభుత్వానికి సహకరించి తెలంగాణ రాష్ట్రంలో విద్యకు మంచిపేరు తీసుకురావాలని కోరారు.