టీఆర్ఎస్ పార్టీ వచ్చే నెల 2న ప్రగతి నివేదన సభ పేరిట రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం పరిధిలోని కొంగరకలాన్లో 25 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సభ ఏర్పాట్లు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి.ఈ మేరకు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ కొంగరకలాన్ బహిరంగ సభాస్థలిని పరిశీలించారు.ఈ సందర్బంగా పార్టీ ముఖ్యనాయకులకు కీలక సూచనలు చేశారు.సభా వేదికతో పాటు పార్కింగ్ ఏర్పాట్లను అక్కడున్న నేతలను అడిగి కేసీఆర్ తెలుసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పై ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది వస్తున్నందున పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
అవుటర్ రింగ్ రోడ్డు నుంచి సభా వేదికకు రావడానికి అనుగుణంగా ఇప్పుడున్న దారులతో పాటు అదనంగా మరికొన్ని దారులు నిర్మించాలని సిఎం చెప్పారు. సభాస్థలానికి రావడానికి అన్ని వైపుల నుంచి 15 నుంచి 20 రహదారులు నిర్మించాలని చెప్పారు. కొత్త రహదారుల నిర్మాణానికి ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి తీసుకోవాలని, వందకు వందశాతం పార్టీ నిధులనే వినియోగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.కేసీఆర్ వెంట మంత్రులు కేటీ రామారావు,నాయిని నరసింహా రెడ్డి తదిరులు ఉన్నారు.