రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు మంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని జనం అనుకుంటున్నామని, కానీ వాళ్లు పెట్టుడు పళ్లతో తిరిగి వస్తున్నారని వైసీపీ ఎమెల్యే రోజా ఎద్దేవా చేశారు. డ్వాక్రా మహిళల రుణాలను రద్దు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవనే చంద్రబాబు.. విదేశీ పర్యటనలు, హంగు, ఆర్భాటాల కోసం వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఐదేళ్ల బాలిక నుంచి 60 ఏళ్ల వృద్ధులపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పే ‘డబుల్ డిజిట్ గ్రోత్’ రాష్ట్రాభివృద్ధిలో కనిపించకపోయినా మహిళలలపై అఘాయిత్యాల్లో కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల సమయంలో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తల్లి కాంగ్రె్‌సతో అంటకాగాలని చూస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరి పోరాటం చేస్తుందని రోజా చెప్పారు.
