గత రెండ్రోజుల క్రితం గుంటూరులో నిర్వహించిన నారా హమారా కార్యక్రమంలో తమ మతస్తులకు జరుగుతున్న అన్యాయంపై శాంతియుతంగా, గాంధేయమార్గంలో నిరసన వ్యక్తం చేసిన ముస్లిం యువకులను పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే ఈ అరెస్టు అప్రజాస్వామికమని వైయస్ఆర్‌సీపీ విమర్శిస్తంది. ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి, మేరుగు నాగార్జునలు ఈ అరెస్టును ఖండించారు. గతంలో ముఖ్యమంత్రులు నిర్వహించిన సభల్లో ఎంతోమంది పౌరులు తమసమస్యలపై నిరసనలు తెలియజేశారని, ఆనాటి ప్రభుత్వాలు వారిని అరెస్టులు చేయలేదని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వం ముస్లిం యువకులను అరెస్టు చేయడం దారుణమన్నారు. సీఎంసభలో మైనార్టీమంత్రిని ప్రకటిస్తారని అందరూ ఎదురుచూస్తే చివరికి మొండిచెయ్యి ఎదురైందని ఎద్దేవా చేశారు. గత నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు అన్ని విధాలా అన్యాయం చేసిందన్నారు. ప్రజాస్వామ్యవ్యవస్థలో తమసమస్యలపై శాంతియుత నిరసన తెలిపేహక్కు ప్రజలకు ఉందన్నారు. చంద్రబాబు ఈవిషయాన్ని తెలుసుకోలేకపోవడం సిగ్గుచేటన్నారు. ముస్లిం యువకులను అరెస్టు చేసి, భయబ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇలాంటి అణచివేత చర్యలను మానుకోకపోతే ప్రజలు టీడీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు వైసీపీ నేతలు.
