నల్గొండజిల్లాలోని ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు. హరికృష్ణ మృతితో ఆయన శిష్యుడు వైసీపీ ఎమ్మెల్యే కొడాలినాని తీవ్ర విషాదంలో ఉన్నారు. నందమూరి ఫ్యామిలీకి నాని అత్యంత సన్నిహితుడు.. హరికృష్ణతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందు నాని వద్దకు ఎక్కువగా వెళుతుండేవారు. నానిని ఎన్టీఆర్ అన్నగా భావించేవారు. నందమూరి కుటుంబంలో ఏకార్యక్రమమైనా కొడాలి నాని తప్పకుండా వుండాల్సిందే.. తరచూ హరికృష్ణ, నానిలు కలిసుకునేవారు. తనకు హరికృష్ణే రాజకీయ జీవితాన్ని ఇచ్చారని నాని వ్యాఖ్యానించేవారు. ఆయన మరణం పట్ల తన రాజకీయ జీవితం హరికృష్ణతోనే ప్రారంభమైందని గుర్తుచేసుకున్నారు. హరికృష్ణతో తనకు 30ఏళ్ల సంవత్సరాల అనుబంధం ఉందని వెల్లడించారు. హరికృష్ణ భోళా శంకరుడనీ, ఎవరడిగినా వెంటనే సాయం చేసే వ్యక్తిత్వం ఆయనదని గుర్తుచేసుకున్నారు.
ఇచ్చిన మాటకోసం హరికృష్ణ చాలాసార్లు నష్టపోయారని కొడాలి నాని వెల్లడించారు. అలాంటి వ్యక్తి ఇలా అకస్మాత్తుగా చనిపోతారని తాను ఊహించలేకపోయానని నాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పర్యటనలో చైతన్యరథాన్ని స్వయంగా నడిపేవారు.. హరికృష్ణకు నడుము పట్టేస్తున్నా, కాళ్లు బొబ్బలెక్కినా తండ్రికోసం నిద్రాహారాలు మాని శ్రమించారు. అలా చైతన్య రథసారథిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అటువంటి హరికృష్ణ ప్రచార రథానికి సారథిగా కొడాలినాని పనిచేశారు అప్పటినుంచీ వీరిద్దరికీ సత్సంబంధాలుడేవి. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో విభేదించి ‘అన్నటీడీపీ’ని స్థాపించారు హరికృష్ణ. అప్పుడు 1999లో గుడివాడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన హరికృష్ణ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. అప్పుడు కూడా కొడాలినాని హరికృష్ణకు ఎంతో సహకరించారు. అయితే కొడాలినానికి హరికృష్ణ మరణవార్త తెలియగానే హుటాహుటిన గుడివాడనుంచి నల్గొండకు బయల్దేరి వెళ్లిపోయారు. హాస్పిటల్ లో చివరిసారి చూసి ఎంతో బాధపడ్డారు. అక్కడినుంచి మృతదేహంవెంటే ఉంటూ నల్గొండ జిల్లాలోని హాస్పిటల్ నుంచి హైదరాబాద్ లోని నివాసం వరకూ అంబులెన్స్ లోనే ఉన్నారు. ఇంటికివచ్చాక మృతదేహాన్ని తన చేతులతో పట్టుకుని కిందకిదించుతూ తననిజమైన స్నేహాన్ని చాటుకున్నారు. గురువు మరణంతో కన్నీరుమున్నీయ్యారు. కొడాలి నాని జీవితంలో మొదటిసారి ఏడవటం చూస్తున్నామని నాని అనుచరులు చెప్తున్నారు. మహాప్రస్థానంలో దహన సంస్కారాలకు హాజరైన నాని మృతదేహం వద్ద చేతులు కట్టుకుని నిస్సహాయ స్థితిలో నిలబడ్డారు. నాని ఆవేదనను చూసినవారంతా వారిద్దరి స్నేహాన్ని గుర్తు చేసుకుంటున్నారు. గురుశిష్యులిద్దరూ ప్రాణ స్నేహితుల మాదిరిగా కలిసుండేవారు.
