ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇస్తామనడం పట్ల వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహించారు. పార్టీ ఫిరాయించిన వారు గెలుపు గుర్రాలు కాదని, అమ్ముడుపోయిన గాడిదలంటూ అంబటి ఎద్దేవా చేశారు. పార్టీమారిన ఎమ్మెల్యేలు పదవులు, డబ్బుకోసం అమ్ముడపోయారని మండిపడ్డారు. చంద్రబాబు, స్పీకర్ యాంటీడిపెన్స్ లాను గౌరవించి పార్టీమారిన ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేస్తే తప్పకుండా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారన్నారు. ఏపీలోని శాసనసభ చాలా విచిత్రంగా ఉందన్నారు. చట్టాలు అమలు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ తరఫున 67 మంది గెలిచారని, ఇవాళ అసెంబ్లీ చూస్తే ప్రతిపక్షం నుంచి గెలిచిన నలుగురు మంత్రులుగా ఉన్నారని, వారితో కలిపి 22మంది శాసన సభ్యులు పార్టీ ఫిరాయించి అధికార పార్టీలో ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యదేశాల్లో ఎక్కడా ఇలాంటి సభను చూసి ఉండరన్నారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ కూడా మాట్లాడారని కానీ అసెంబ్లీలో జగన్ పది నిమిషాలు మాట్లాడితే ఇక్కడి స్పీకర్ 9సార్లు మైక్ కట్‌ల చేశారన్నారు. చంద్రబాబు మాత్రం అసెంబ్లీలో రంకెలెస్తారని తప్పుపట్టారు. అతిదారుణంగా అసెంబ్లీని నిర్వహిస్తున్నారన్నారు. అందుకే ఈ సభను బహిష్కరించాలని మేం నిర్ణయం తీసుకున్నామన్నారు. మా పార్టీ తరఫున గెలిచి అధికార పార్టీలో చేరిన వారిపై వేటు వేయాలని కోరితే ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మమ్మల్ని సభకు పిలవడం ఏంటి దారుణమన్నారు. కనీసం జ్ఞానం వస్తుందేమో అని ఇన్నాళ్లు వేచి చూశామన్నారు.. ఎవరైతే మా పార్టీ నుంచి అవతలి పార్టీలో చేరారో, చంద్రన్న సేవలో నిమగ్నమైన ఎమ్మెల్యేలతో లేఖ రాయించారన్నారు. వీరు రాసిన లెటర్ చూస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎవరైనా పార్టీ మారవచ్చట. అయతే పార్టీ మారిన వారు ఎందుకు ఆ పదవికి రాజీనామా చేయడం లేదని ఆయన నిలదీశారు. ఈ లేఖ చంద్రబాబే రాసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. గెలుపు గు్రరాలకే టికెట్లు ఇస్తామని, అమ్ముడపోయిన గాడిదలకు చంద్రబాబు టికెట్టు ఇవ్వరని ఆయన వ్యాఖ్యలు చేసినట్లు చెప్పారు. అసెంబ్లీ రాకుంటే ఎమ్మెల్యేలు వేతనాలు ఎలా తీసుకుంటారని చంద్రబాబు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటూ పాదయాత్ర చేస్తూ అసెంబ్లీకి వెళ్లకుండానే జీతాలు తీసుకున్నారన్నారు. చంద్రబాబు ఏ పార్టీ నుంచి ఎదిగారని, అలాంటి వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపొటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు.
