రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘రావాలి జగన్– కావాలి జగన్’ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రమంతటా ఉత్సాహంగా సాగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల ప్రయోజనాలను పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలకు సవివరంగా తెలియజేస్తున్నారు. ఈ పథకాలతో వివిధ వర్గాల ప్రజలకు కలిగే మేలును వివరిస్తున్నారు.
కర్నూల్ జిల్లాలో శనివారం పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, సమన్వయ కర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నందికొట్కూరు నియోజకర్గ వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య, సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా పగిడ్యాల మండలంలో నవరత్న పథకాలపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నవరత్నాలతో కలిగే లబ్ధిని ప్రజలకు వివరిస్తున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం దారుణమన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు గిట్టుబాటుధర కల్పించటంతో పాటు అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.