ముందస్తు ఎన్నికలకు ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార బహిరంగ సభల షెడ్యూలు ఖరారైంది. అక్టోబర్ 3 నుంచి 8 వరకు వరుసగా ఉమ్మడి జిల్లాకు ఒక బహిరంగసభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. అక్టోబర్ 3న నిజామాబాద్‌లో, 4న నల్లగొండ, 5న వనపర్తి (మహబూబ్‌నగర్), 7న వరంగల్, 8న ఖమ్మంలో ప్రచార సభలు జరగనున్నాయి. ఉమ్మడి మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్‌లో తర్వాత దశలో నిర్వహిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో సెప్టెంబర్ 7న నిర్వహించారు.
ప్రగతి నివేదిన సభ గ్రేటర్ హైదరాబాద్‌లోనే నిర్వహించినందున హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మళ్లీ బహిరంగసభలు ఉండకపోవచ్చని తెలిసింది. ముందస్తు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే లోపు ప్రతి జిల్లా కేంద్రంలో బహిరంగసభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. తొలుత నిజామాబాద్‌లో తొలి సభ నిర్వహిస్తున్నారు. ఆ సభ నిర్వహణ బాధ్యతలను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు అప్పగించారు. ఉమ్మడి నిజామాబాద్‌లోని మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. ప్రతి బహిరంగసభను లక్ష మందికి తగ్గకుండా నిర్వహించాలని నిర్ణయించారు.