2019 సార్వత్రిక ఎన్నికలకు అందరికంటే ముందుగా ఎవరు సిద్ధమయ్యారు అనే ప్రశ్నకు టక్కున చెప్పాల్సిన సమాధానం పేరు మోడీనే. 2014 ఎన్నికల్లో గెలిచి ప్రధానమంత్రి పదవి అధీష్టించిన మోడీ అప్పటి నుంచే 2019 ఎన్నికలపై కసరత్తు చేస్తూ వచ్చారు. అసలు ఎన్నికలు ఐదేళ్లు ఉన్నాయిగా.. అప్పుడే ఎందుకు సన్నద్ధమయ్యారు..? ఎలా అయ్యారు అనే ప్రశ్న మీకు తలెత్తవచ్చు. అవును, నిజమే మేము లేవనెత్తే విషయాలు మీరూ కూడా గమనిస్తే అవును అనాల్సిందే.! ఎలాగంటారా..? ముందుగా దక్షిణాది విషయానికొస్తే…సౌత్ ఇండియాను పూర్తిగా మోడీ తన గుప్పెట్లో పెట్టుకున్నారనే చెప్పాల్సి వస్తుంది.
అదెలా అంటే కేరళ రాష్ట్రం విషయానికొస్తే కేరళ ప్రజలకు రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి ఉండదనే చెప్పాలి. కేరళలో అత్యధికంగా ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఉన్నందున ఇక్కడ ముఖ్యంగా అభివృద్ధి ఆధారిత అంశాలపైనే ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. సీఎం పనితీరు, అవినీతి రహిత పాలనను ఇక్కడి ప్రజలు ఎక్కువగా కాంక్షిస్తారు. మరీ ముఖ్యంగా ఇక్కడి ప్రజలు కమ్యూనిస్ట్ భావజాలంతో ఉంటారు. మరియు కేరళలో ఎక్కువ శాతం క్రిస్టియన్లే, ఇక్కడి విశేషమేమిటంటే అత్యధికంగా దేవాలయాలు కూడా కేరళలోనే ఉన్నాయి. మేజారిటీ ప్రజలు క్రిస్టియన్లే అయినప్పటికీ హిందూత్వ విధానాన్ని మాత్రం ఇక్కడి జనం వ్యతిరేకించరు. ఇలాంటి రాష్ట్రంలో బీజేపీ వ్యూహమేంటి.? కేరళ ఓటర్ల నాడి బీజేపీ ఎలా పట్టనుంది.? ప‌్రస్తుతం కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రాటిక్ పార్టీ (ఎల్‌డీఎఫ్)కి కొంత గడ్డుకాలమే అని చెప్పాలి. గతంలో భారీ వర్షాలు, వరదలకు గురైన కేరళ రాష్ట్రం పూర్తిగా కోలుకోలేదు. ఈ అంశాన్ని కేంద్రం చాలావరకు క్యాష్ చేసుకుందనే చెప్పాలి. కేంద్రం నుంచి భారీగా నిధులు ముంజూరు చేయడం. వరద ముంపు బాధితులకు సహాయం చేసేందుకు కేంద్ర బలగాలను భారీగా రాష్ట్రానికి పంపండం. ప్రత్యేక చొరవతో ప్రకృతి విపత్తుపై సమర్థవంతంగా పనిచేయడం, నోట్ల రద్దు, జీఎస్టీ ఇలా పలు కార్యక్రమాలతో కేరళ వాసులను బీజేపీ బాగానే ఆకర్షించగా ఇది మొన్నటి ఎన్నికల్లో మంచి ప్రభావమే చూపిందనుకోవచ్చు.
ఇక తమిళనాడు… ఒక రకంగా చెప్పాలంటే అరవ రాష్ట్రం పూర్తిగా మోడీ కనుసన్నల్లోనే ఉందని చెప్పాలి. గత ఎన్నికల తర్వాత జయలలిత అవినీతి కేసులో జైలుపాలు అవ్వడం. ఆ తర్వాత అనారోగ్యంతో మృత్యువాత పడటం. అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును రంగంలోకి దింపి తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పడం. ఆ తర్వాత కొద్ది రోజులు తమిళనాట రాజకీయ సంక్షోభం ఏర్పడటం. ఆనూహ్య రీతిలో పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేయడం. అన్ని మోడీ డైరెక్షన్‌లో చకచకా జరిపోయాయి. తమిళనాడులోని ప్రతిపక్షం అయిన డీఎంకే పార్టీ విషయానికొస్తే కరుణానిధి మరణం ఆ పార్టీకి తీరని లోటు. అందుకు తోడు డీఎంకేపై గతంలో ఉన్న పలు అవినీతి ఆరోపణలు, కణిమోళిపై కేసులు ఇవన్నీ స్టాలిక్‌కు మైనస్ కావొచ్చు. సరిగ్గా ఈ బలహీనతలే మోడీ వాడుకోవచ్చు. 2019లో బీజేపీకి మద్ధతివ్వమని స్టాలిన్‌ను డిమాండ్ చేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ప్రజల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ కేంద్రంలో మద్ధతు మాత్రం బీజేపీకే ఉండొచ్చు! ఎలాగంటారా.? ప‌్రత్యేక హోదా ఇస్తాంటూ గతంలో నమ్మబలికిన బీజేపీ ఐదేళ్లు గడిచినా ఆ అంశంపై ఎలాంటి స్పందన లేదు. మరోసారి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటూ ప్రకటించినప్పటికీ అదీ ఏమైందోకూడా తెలియని పరిస్థితి. చివరి పార్లమెంట్ సమావేశాల్లో ఎట్టకేలకు విశాఖ రైల్వేజోన్‌కు ఆమోదం తెలిపినప్పటికీ ప్రజలు ప్రత్యేక హోదా అంశాన్ని మాత్రం ఇంకా మర్చిపోలేదు.
ప్రత్యేక హోదాపై నురుమెదపని దుస్థితి చంద్రబాబుది. ఎందుకంటారా..?
కేంద్ర నిధులు వినియోగించడంలో భారీ అవకతవకలు, పోలవరం నిర్మాణ పనుల్లో కేంద్రం పేరు కూడా ఎత్తకపోవడం, ఎన్నికలకు ముందు ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడం, ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అవ్వడం, ఇటీవలి ఐటీగ్రిడ్ కేసులోనూ టీడీపీ ప్రభుత్వం హస్తం ఉండటం ఇలా అనేక ఆరోపణల నేపథ్యంలో ప్రధాన మంత్రి మోడీకి చంద్రబాబు భయపడాల్సిందే, భవిష్యత్‌లో టీడీపీ అవసరం బీజేపీకి వస్తే తప్పకుండా మద్దతు కూడా ఇవ్వాల్సిందే.
ఇక జగన్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ కేంద్రం అనేక ఇబ్బందులకు గురిచేసినప్పటికీ సమర్థవంతంగా వాటిని తిప్పికొడుతూ నిరంతరం ప్రజల్లో ఉంటున్న జగన్ ప్రజాసంకల్ప యాత్రతో రాష్ట్రమంతా చుట్టేశారు. ప్రజల నాడీ వైఎస్సార్‌సీపీ వైపే ఉండగా, సర్వేలన్నీ జగన్‌వైపే మొగ్గుచూపడం విశేషం. ఇక జగన్ గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతిస్తారు అనేది వేచిచూడాలి. ఒక వేళ ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి మద్ధతిస్తామన్న జగన్ వ్యాఖ్యలపై బీజేపీ సానుకూలంగా స్పందిస్తే బీజేపీకి మద్ధతిస్తారనడంలో ఎలాంటి సందేహం లేకపోలేదు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం బీజేపీకి కాస్త ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి. తెలంగాణపై గంపెడాశలు పెట్టుకున్న బీజేపీ అధిష్టానం ఆశలు గల్లంతయ్యేలా ప్రజలు తీర్పునిచ్చారు. ఎవ్వరూ ఊహించని విధంగా 89 అసెంబ్లీ స్ధానాల్లో ప్రజలు టీఆర్ ఎస్‌కు పట్టం కట్టారు. కేసీఆర్ వాగ్ధాటిని సమర్థవంతంగా తిప్పుకొట్టే నాయకత్వం బీజేపీలో లేకపోవడం. హిందూత్వ వాదంతో తెలంగాణలో ప్రచారం చేయడం, కేంద్ర నిధుల మంజూరులో జాప్యం, తెలంగాణ ప్రభుత్వంపై పొంతనలేని ఆరోపణలు చేస్తూ ఎన్నికల యుద్ధం చేసిన బీజేపీకి ఉన్న ఐదుసీట్లు కాస్తా పోయి చివరికి 1 సీటుకు పతనమైంది.
ఇటీవలి ఏప్రిల్ 11న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందని టీఆర్ ఎస్ వర్గాలు అంటుండగా. ఈ ఎన్నికల్లో చెప్పుకొదగ్గ సీట్లు గెలుస్తామని, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్‌ను గెలిపించిన ప్రజలే ఈ సారి కమలం గుర్తుకు ఓటేస్తారని బీజేపీ ధీమాగా ఉంది. రాష్ట్రానికి నిధులు మంజూరు విషయంలో మాత్రమే కేసీఆర్ మోడీకి మద్ధతివ్వడం తప్పా, వేరే ఇతర కారణాలేమీ లేవని చెప్పుకోవచ్చు. ఇలా దక్షిణాదిలో 130 లోక్‌సభ స్థానాలుండగా కనీసం 100 స్థానాలు ఏ పార్టీ గెలిచినా తమకు మద్ధతునిస్తాయనే ఆశతో ఉంది బీజేపి.
ఇక ఉత్తరాది విషయంలో దేశ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఉత్తర్ ప్రదేశ్‌లో హోరీహోరీగా ఎన్నికలు సాగినప్పటికీ స్థానికంగా బీజేపీనే అధికారంలో ఉండటం కలిసొచ్చే అంశం. ఇదే అంశం కాంగ్రెస్‌కు కూడా కలిసిరావొచ్చు. ప్రభుత్వ వ్యతిరేకతే మాకు ఓట్లు కురిపిస్తాయని కాంగ్రెస్ భావిస్తుండగా, రాహుల్ గాంధీ మాకు పోటీనే కాదు అది బీజేపీ వ్యంగ్య విమర్శలు చేస్తుంది. మొన్న జరిగిన మోడీ ర్యాలీకి ప్రజలు బ్రహ్మరథం పట్టగా.. గతంలో యోగి ఆదిత్యనాథ్ స్థానమైన ఘోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానంలో ఉప ఎన్నిక ఘోర పరాజయం బీజేపీ శిబిరాన్ని కాస్త నిరాశకు గురిచేసింది. ఇక పశ్చమ బెంగాళ్‌లో మమతా బెనర్జీని పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో అనేక ఇబ్బందులు పెట్టగా.. ఇదే అంశంతో మమతా ప్రజల్లోకి వెళ్లి కేంద్రప్రభుత్వాన్ని ఎండగట్టింది. బెంగాళ్ ప్రజలు విజ్ఞులు అని ప్రాంతీయ పార్టీ వైపే మా ప్రజలు ఉన్నారని మమత వాదిస్తుండగా.. అమిత్ షా బహిరంగ సభలకు కూడా అనుమతి నిరాకరించడం విశేషం.
మరోవైపు మమత అవినీతి స్కామ్‌లే తృణమూల్ కాంగ్రెస్ ఓటమికి కారణమవుతాయని, బెంగాళ్ ప్రజలు మమతకు గట్టి బుద్ధి చేబుతారంటూ బీజేపీ ధీమాతో ఉంది. బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ స్థానాల్లో పరాజయం పొందినప్పటికీ, మిగతా రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాల్లో ప్రజలు బీజేపీని గెలిపిస్తారని మోడీపై దేశప్రజల్లో తీవ్రమైన విశ్వాసం ఉందని 300కు పైగా లోక్‌సభ స్థానాలు బీజేపీ కేవసం చేసుకుంటుందని పార్టీ శ్రేణులు విశ్వాసంతో ఉన్నారు.