టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ మరిన్ని చిక్కుల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఫోర్జరీ కేసులో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తును ముమ్మరంచేశారు. అయితే, విచారణకు హాజరుకావడానికి పది రోజుల గడువు కా వాలని రవిప్రకాశ్ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. దీనిపై సుముఖంగా లేని పోలీసులు సోమవారం హాజరుకావాల్సిందేనంటూ రవిప్రకాశ్‌కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఫోర్జరీ కేసులో ఏప్రిల్ 24న అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్‌రావు ఫిర్యాదుపై పోలీసులు 160 సీఆర్పీసీ నోటీసును రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ, సీఎఫ్‌వో మూర్తికి ఇచ్చారు. ఈ నోటీసులను రవిప్రకాశ్, శివాజీ తీసుకోకపోవడంతో వాటిని వారి ఇండ్లకు అం టించారు. రవిప్రకాశ్ ఈ నోటీసులకు కూడా స్పందించకపోతే పోలీసులు చట్టపద్ధతిలో చర్యలుచేపట్టే అవకాశం ఉంది.
మరోవైపు ఇప్పటికే ఫిర్యాదుదారుల స్టేట్‌మెంట్లను రికార్డుచేసిన పోలీసులు, ఇంకా కొందరిని ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదులోని అంశాలతో లింక్ ఉన్న ప్రతి పత్రం, ప్రతి వ్యక్తిని పోలీసులు విచారించడంతోపాటు ప్రశ్నించనున్నారు. సోదాల్లో దొరికిన పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు ఇతర వస్తువులను కోర్టు అనుమతితో ఫోరెన్సిక్‌ల్యాబ్‌కు పంపి, వాటిలోని సమాచారాన్ని సేకరించనున్నారు. ఈ సమాచారంలో ఒకవేళ, ఫోర్జరీ నిజమని తేలితే..రవిప్రకాశ్‌పై చర్యలు తీసుకోవడం ఖాయమని అంటున్నారు.