తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రేటర్ పరిధిలో జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. నగరంలోని పలు ప్రధాన కూడళ్లు, చారిత్రక భవనాలు, పార్కులు, తెలంగాణ అమరవీరుల స్థూపాలు, ప్రభుత్వ కార్యాలయాల భవనాలను అందమైన విద్యుత్ దీపాలతో జీహెచ్ఎంసీ అలంకరించింది. నగరంలోని మొత్తం 191 ప్రాంతాల్లో రూ. 74.39 లక్షల వ్యయంతో లైటింగ్ ఏర్పాటు చేశారు. ఈ లైటింగ్‌లో 400వాట్ల సామర్థ్యం గల 217 ఫ్లడ్ లైట్లు, వెయ్యి వాట్ల సామర్థ్యం గల 204 ఆలోజన్ లైట్లు, 2003 పార్కాన్లు, 12వేల సీరిస్ లైట్లు, బెలూన్ మాదిరి లైట్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేయడంతో సిటీ రంగురంగుల విద్యుత్ దీపాలతో కలకలలాడుతోంది. వీటితో పాటు నగరంలో ఉన్న అమరవీరుల స్మారక స్తూపాల వద్ద ప్రత్యేక అలంకరణ, శానిటేషన్ చేపడుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ తోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు నగరవాసులు పెద్ద ఎత్తున అమరవీరులకు నివాళులర్పించే గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపానికి ప్లోరల్ డెకరేషన్ తదితర ఏర్పాట్లను జీహెచ్ఎంసీ చేపట్టింది. అదనపు పారిశుధ్య సిబ్బందిని నియమించి గన్‌పార్క్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచడంతో పాటు తాత్కాలిక టాయిలెట్లను కూడా ఏర్పాటు చేసింది. దీనితో పాటు ప్రధాన కార్యక్రమం జరిగే పబ్లిక్ గార్డెన్‌లో కూడా ప్రత్యేక సిబ్బందిని నియమించి పారిశుధ్య కార్యక్రమాలను జీహెచ్ఎంసీ చేపట్టింది. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, చారిత్రక ప్రదేశాలను తెలిపే రోబిక్స్ క్యూబ్ పలువురిని ఆకట్టకుంటోంది.
