తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ప్రశంసల జల్లు కురిపించారు. సోమవారం సీఎం కేసీఆర్ ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 21 న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని జగన్‌కు సీఎం కేసీఆర్ ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం విభజన చట్టంతోని పెండింగ్ అంశాలపై ఇరువురు సీఎంలు చర్చించారు. ఆ తరువాత శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి చేరుకొని.. అక్కడ విశాఖ శ్రీ శారదాపీఠ ఉత్తరాధికారి శిష్య తురియాశ్రమ స్వీకార మహోత్సవంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం సందర్భంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కేసీఆర్ ను ఆయన అభినందనలతో ముంచెత్తారు. సీఎం కేసీఆర్ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. కేసీఆర్ ఒక మేధావి అని కొనియడారు. మహాభారతాన్ని రెండు సార్లు చదివి ముఖ్యమంత్రి అయిన ఏకైక సీఎం కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ హిందూ దేవాలయాలపట్ల, భూముల పట్ల ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారిగా నియమితులైన స్వాత్మానందేంద్ర సరస్వతి గురించి కేసీఆర్ కు ముందే తెలుసునని స్పష్టం చేశారు. విశాఖ శారదా పీఠం శిష్య తురియాశ్రమ దీక్ష మహోత్సవంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొనడం అభినందనీయమన్నారు.