సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరంతర విద్యుత్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో వ్యవహరిస్తున్నారని అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. రైతులకు, పరిశ్రమలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విద్యుత్ వినియోగించుకునేందుకు గ్రిడ్స్ ద్వారా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. విద్యుత్ అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని, విద్యుత్ విషయంలో ఎల్లప్పుడూ ముఖ్యమంత్రికి పూర్తి నివేదిక అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సూచనలతో రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు రాకుండా పర్యవేక్షిస్తున్నామని ప్రభాకరరావు స్పష్టం చేశారు
