తాజాగా నిన్న సోమవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో జరిగిన హెలికాఫ్టర్ ఘటనలు ఆపార్టీ శ్రేణులను ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సోమవారం జగన్ తాడేపల్లిలో నివాసం నుంచి హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ వెళ్లడానికి బయల్దేరారు. అయితే గన్నవరం ఎయిర్ పోర్టులో జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు సమస్యలు ఉన్నాయని అధికారలు సమాచారం అందించారు. దీనిపై సీఎం కార్యాలయ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ హెలికాఫ్టర్ ల్యాండింగ్ విషయంలో వివాదాల కారణంతోనే జగన్ హైదరాబాద్‌కు ఆలస్యంగా వచ్చారట. ఈ కారణంగానే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం సాయంత్రానికి వాయిదా పడింది. మరోవైపు శనివారం కూడా సీఎం కర్నూలు జిల్లా నంద్యాల పర్యటనకు వెళ్లినపుడూ హెలికాప్టర్ ల్యాండింగ్ వివాదం చోటు చేసుకుందని అధికారులే చెబుతున్నారు.
సీఎం హెలికాఫ్టర్ ల్యాండింగ్ విషయంలో అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారట. హెలికాఫ్టర్ ల్యాండింగ్ వివరాలు ప్రొఫార్మా ప్రకారం డిగ్రీలు, మినిట్స్, సెకండ్స్ రూపంలో ఇవ్వాలని కానీ అక్కడ కేవలం కేవలం డిగ్రీల్లో మాత్రమే ఇచ్చారట.. దీనిని సరి చేసేందుకు కొన్ని నిమిషాల సమయం పట్టగా అప్పటివరకూ సీఎం హెలికాఫ్టర్ గాలిలోనే ఉందట.. ఇది చాలా నిర్లక్ష్యమని సీఎంఓ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఈ ఘటన కర్నూలులోనే జరగడం.. వర్షాలు కూడా పడుతుండడం పట్ల అధికారులకు ముచ్చెమటలు పట్టాయట.. ఈ ఘటన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు.
దీనిపై సమగ్ర విచారణ జరపాలనని కర్నూలు కలెక్టర్‌కు సీఎం కార్యాలయం ఆదేశాలు జారీ చేసారు. కర్నూలు డీఆర్ఎం వెంకటేశ్వరన్ విచారణ అధికారిగా నియమించారు.నిర్లక్ష్యంగా వ్యవహరించిన సర్వేశాఖ డీఐ వేణుకు కలెక్టర్ నోటీసులు జారీ చేసి అతనిని సస్పెండ్ చేయనున్నారట. జగన్ మామూలు వ్యక్తి కాదు.. బలమైన రాజకీయ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇలాంటి వ్యక్తి భద్రత విషయంలో ఒకసారి కాదు ఏకంగా రెండుసార్లు ఇలా జరగటంతో సీఎం కార్యాలయం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. మరోవైపు గతంలో కర్నూలు జిల్లాలోనే జగన్ తండ్రి వైఎస్ హెలికాఫ్టర్ దుర్ఘటన జరగడం.. అప్పుడు కూడా వర్షం పడుతుండడం వంటి ఘటనలతో పార్టీ శ్రేణులు మరింత ఆందోళన చెందుతున్నారు. జరగరానిది జరిగితే బాధ్యులెవరు.? అని ప్రశ్నిస్తున్నారు.