టీడీపీని వీడి వైసీపీలో చేరాలనుకుంటున్న తన స్నేహితుడు గంటా శ్రీనివాసరాపు ప్రయత్నాలను మంత్రి అవంతి శ్రీనివాస్ అడ్డుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. ఒకప్పుడు విశాఖ రాజకీయాలను శాసించిన గంటా భవిష్యత్తు అవంతి చేతుల్లోనే ఉందట.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే కాస్త అలానే ఉన్నాయి. ఏపీ వైసీపీలో ఇప్పుడు నేతలకు కొదవలేదు. అయితే విశాఖలో పార్టీ పరిస్ధితి భిన్నంగా ఉంది. పేరుకు ఎమ్మెల్యేలున్నా వారిని ముందుడి నడిపించేవారు లేదు. మరోవైపు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న వైసీపీ పార్టీ సిద్ధాంతాలకు లోబడి విశాఖలో ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టాలని భావిస్తోంది. పలువురు నేతలను కూడా చేర్చుకుంది. తర్వాత గంటా శ్రీనివాస్ తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకుంటారన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి అవంతి అడ్డుపడుతున్నారనే వార్తలొస్తున్నాయి.
దీనికి గంటా కూడా కౌంటరిచ్చారు. ఒకప్పుడు స్నేహితులైన వీరిద్దరి మధ్య అగాధం ఏర్పడింది. మరోవైపే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి విశాఖ నార్త్ నుంచి మళ్లీ గెలిచేందుకు గంటా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట.. అలాగే తాను అవంతి మాటలను పట్టించుకోవట్లేదని, తాను వైసీపీలోకి వెళ్లాలనుకుంటే ఎవరూ ఆపలేరని, అందరితో చర్చించే వెళ్తానని గంటా అనడంతో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు అర్ధమవుతోంది. అలాగే ఎవరో తనను రెచ్చగొట్టాలని చూస్తే ట్రాప్‌లోపడనన్నారు ఈ మాజీ విద్యాశాఖ మంత్రి. గతంలో భీమిలి అసెంబ్లీ టికెట్ కు బదులుగా విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాల్సిందేనంటూ చంద్రబాబు ఒత్తిడి చేయడం తప్పనిసరి పరిస్థితిలో విశాఖ నార్త్ నుంచి గెలవడం తెలిసిందే. అప్పుడే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఫోన్ నంబర్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసినా గంటా అందుబాటులోకి రాలేదు. అప్పుడే గంటా వైసీపీలోకి రావాలనుకున్నా అప్పటి పరిస్థితుల దృష్ట్యా గంటాను వైసీపీ అధిన్యాయకత్వం సహకరించలేదు.
అనంతరం ఆయన కోరుకున్న భీమిలీ టికెట్ నారా లోకేష్ పేరు, తర్వాత సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని, ఆయనకు భీమిలీ టికెట్ ఇస్తారంటూ లీకులిచ్చారే తప్పసిట్టింగ్ ఎమ్మెల్యేకు ఒక్కమాట చెప్పలేదు. తర్వాత లోక్ సభపోటీకి గంటా విముఖత చూపడంతో తప్పనిసరిగా ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చారు. తాను భీమిలీ నుంచే పోటీ చేస్తానంటూ చెప్పుకున్నా ఇంత తతంగం నడపడం పట్ల గంటా బాధపడ్డారట.. దీనిపై అప్పటినుంచి మనస్థాపానికి గురైన గంటా టీడీపీని వీడటానికి సిద్ధపడినట్లు సమాచారం. మళ్లీ వైసీపీనుంచి పోటీ చేసి గెలవడం ఖాయమని, మరోసారి మంత్రి అవడం ఖాయమని గంటా అనుచరులు చెప్తుున్నారు. అయితే గంటా చేరికను విశాఖ వైసీపీ వ్యతిరేకిస్తున్నప్పటికీ కండిషన్లతో ఆయనను చేర్చుకుంటే తమకు అభ్యంతరం లేదని, ఆయన రాక అవసరమేనని పలువురు చెప్తున్నారు.