ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు వైసీపీ కార్యకర్తలకే ఇచ్చారని చంద్రబాబు అన్నారు. అసలు ఆ ఉద్యోగం వాళ్లకు ఇవ్వమని ఎవరడిగారంటూ సీఎం జగన్‌ను నిలదీశారు. రూ.5వేలకు గోనె సంచులు మోసే ఉద్యోగం ఇచ్చి ఉద్యోగాలిచ్చాం అంటారా? అంటూ మండిపడ్డారు. బియ్యం సంచులు మోసే ఉద్యోగాలు ఇచ్చి తామేదో పెద్ద ఉద్యోగాలు ఇచ్చేసినట్లుగా ప్రభుత్వం కథలు చెప్పుకుంటుందంటూ చంద్రబాబు విమర్శించారు.
గ్రామ వాలంటీర్లుగా నియమితులైన వాళ్లు అకృత్యాలు చేస్తున్నారని, ఎప్పుడంటే అప్పుడు ఇళ్లకు వెళ్లి డిస్టర్బ్ చేయడం, మగాళ్లు ఇళ్లల్లో లేనప్పుడు వెళ్లి డోర్లు కొట్టడం చేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఇటువంటి పనులు చేయడం ఎంతో నీచమని ప్రశ్నించారు. వీటినిచూస్తుంటే తనకు ఎంతో బాధేస్తుందని, ఆవేదన, ఆవేశం వస్తుందన్నారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో వాలంటీర్ వేధింపుల కారణంగా ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని దీనిపై స్పందించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.