హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ జోరు మీదుంది. ప్రచారంలో గులాబీ పార్టీ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఎక్కడికెళ్లినా అపూర్వ స్పందన లభిస్తోంది. నేరేడుచర్ల, పాలకీడు మండలాల్లో సైదిరెడ్డి క్యాంపెయిన్ నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ నెల 21న జరిగే ఎన్నికలో టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో విజయకేతనం ఎగరవేయడం ఖాయమని సైదిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని నేరేడుచర్ల మండలంలో గులాబీ సైనికులు కదం తొక్కారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించాలని కోరుతూ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చి నాలుగు కిలోమీటర్ల మేర చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్నికల మండల ఇంఛార్జి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దివ్యాంగుల సంస్థ ఛైర్మన్ వాసుదేవ రెడ్డి, స్థానిక నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హుజూర్‌నగర్ దశ తిరగాలంటే కారు గుర్తుకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
హుజూర్‌నగర్ ఉపఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ కు అద్భుత స్పందన లభిస్తోంది. మండలాల వారీగా నియమితులైన పార్టీ ఇన్‌చార్జ్ లు సమన్వయ కర్తలు ప్రచారాన్ని ఉధృతం చేశారు. నెరేడుచర్ల మండలం దీర్శించర్ల గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో ఎంపీ మాలోత్ కవిత, టీఆర్ఎస్ నాయకులు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు ఇంటింటి ప్రచారం చేసి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఎంపీ మాలోత్ కవిత స్పష్టం చేశారు.