తెలంగాణ రాష్ట్ర ఐటీ ,మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని గ్రేటర్ లో పలు ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందన్ చెరువు,మంత్రాల చెరువు,పెద్ద చెరువులోకి వచ్చే మురుగునీరు రాకుండా మొత్తం ఇరవై మూడు కోట్లతో హెచ్ఎండీఏ చేపట్టనున్న ట్రంక్ లైన్ పనులకు మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు.
అంతేకాకుండా మంగళపల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కును కూడా ప్రారంభించారు మంత్రి కేటీఆర్. మొత్తం ఇరవై రెండు కోట్లతో హెచ్ఎండీఏ-ఆన్ కాన్ లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేసిన సంగతి మనకు తెల్సీందే. మరోవైపు పెద్దాంబర్ పేట జంక్షన్ నుండి బాట సింగారం వరకు దాదాపు నాలుగు కి.మీల మేర రూ.1.82కోట్లతో స్ట్రీట్ లైట్ల ఏర్పాటు పనులను కూడా ప్రారంభించారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ”ఆధునీక సాంకేతిక యుగంలో పట్టణీకరణ శరవేగంగా జరుపుకుంటున్న హైదరాబాద్ విశ్వనగరం వ్యాప్తి నేపథ్యంలో ఓఆర్ఆర్ వలన నగరం చుట్టూ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుంటుంది. ఇప్పటికే ఓఆర్ఆర్ చుట్టూ మొత్తం 19ఇంటర్ చేంజ్ కూడళ్లు ఉన్నాయి. ఈ ఓఆర్ఆర్ చుట్టూ మరో ఎనిమిది లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ” నగరానికి అత్యాధునీక వసతులతో కూడిన రెండు రైల్వే టర్మినల్స్ రానున్నాయి. మౌలిక వసతుల కల్పనను పెంపొందించి పారిశ్రామిక వృద్ధిని పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. బుద్వేల్ లో మరో ఐటీ క్లస్టర్ ను ఏర్పాటు చేయనున్నాము. ప్రస్తుతం ప్రారంభించుకున్న మంగళ్ పల్లి లాజిస్టిక్ పార్కుతో ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు.