Home / EDITORIAL / తెలంగాణ ప్రజలారా. ఒక్క క్షణం ఆలోచించండి!

తెలంగాణ ప్రజలారా. ఒక్క క్షణం ఆలోచించండి!

మహిషీ ప్రసవోన్ముఖీ, మహిషో మదనాతురః బర్రె ఈననున్నది.. దున్న మరులుగొన్నది పాపం బర్రెకు నెలలు నిండి ప్రసవ వేదనతో అటూ ఇటూ తిరుగుతూ బాధతో యాతన పడుతున్నది. దీని బాధలో ఇదుంటే అదే దొడ్లో కట్టేసిన ఓ దున్న ఈ బర్రెను చూసి మదనతాపంతో తనుగు తెంచుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నది. అవును. ఎవరి బాధ వాళ్లది.
 
సరిగ్గా రాష్ట్ర రాజకీయాల పరిస్థితీ ఇలాగే ఉంది. తెచ్చుకున్న రాష్ర్టాన్ని ఎలా అభివృద్ది చేసుకోవాలనే బాధ టీఆర్‌ఎస్‌దైతే… కేసీఆర్‌ను దింపి అధికారం ఎలా సాధించాలనే తాపత్రయం ప్రతిపక్షాలది. కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల ఫలాలు ప్రజల చేతికందించేందుకు ప్రభుత్వం ప్రసవ వేదన పడుతుంటే.. అడ్డుపుల్లలు వేసి వైఫల్యం ముద్రవేయాలనే తపన ప్రతిపక్షాలది. మంచీచెడు విచక్షణ లేదు. సాధ్యాసాధ్యాల ప్రసక్తి లేదు. రాష్ట్రం ఏమైనా సరే.. అధికార పార్టీని దింపడమే లక్ష్యం. కాంగ్రెస్ బీజేపీ మొదలుకొని వామపక్షాల దాక.. సమైక్యరాష్ట్రంలో మ్యాచ్ ఫిక్సింగులతో చల్లగా బతికిన దుకాణాలు అన్నింటిదీ ఇదే వైఖరి. ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన జరిగినా ఈ మూక కట్టకట్టుకొని వాలటం. కేసీఆర్ మీద ఆయన కుటుంబం మీద దూషణలతో కడుపులో ఉన్న కసి కక్కేయటం. ఆనాడు మల్లన్నసాగర్ ఆందోళన.. ఇవాళ ఆర్టీసీ సమ్మె.. అన్నింటా ఇదే వైఖరి.
 
ఇంతకూ వీళ్లు కోరేదేమిటి? రాష్ట్రం ఎలా ఉండాలనుకుంటున్నారు? ఎవరి చేతుల్లో పెట్టాలనుకుంటున్నారు? ప్రస్తుత ప్రభుత్వం చేసిన నష్టమేమిటి? ఉపరితల రవాణా నుంచి మొదలుకొని రైల్వేలైనా విమానయానమైనా జలరవాణా అయినా దేశమంతటా ప్రత్యేక సంస్థల నిర్వహణలో నడుస్తున్నాయి. మిగిలిన ప్రభుత్వశాఖల్లా కాకుండా ఇవి సేవలు అందించి ప్రతిఫలం తీసుకుంటాయి. రోజువారీ ఆదాయం, ఖర్చులు ఉంటాయి. ప్రభుత్వశాఖల్లో సేవలన్నీ ఉచితంగా ఉంటాయి. అందుకే ఈ సంస్థలను ప్రత్యేక సంస్థల కిందే ఉంచుతున్నారు. అందుకే దేశంలో అన్ని ప్రజారవాణా వ్యవస్థలను కార్పొరేషన్లుగా ఉంచారు. ఇవే కాదు.. విద్యుత్ సంస్థలు డెయిరీ సంస్థల వంటివి కూడా కార్పొరేషన్లలోనే కొనసాగిస్తున్నారు. అవసరాన్ని బట్టి ప్రభుత్వం వాటికి ఆర్థిక మద్దతు ఇస్తున్నది. గత అరువై ఏండ్లలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ బీజేపీ రెండూ ఈ విధానాన్నే అనుసరించాయి. అవి పాలించే అన్నిరాష్ర్టాల్లో ఇదే విధానం అమలులో ఉన్నది.
 
మాట్లాడితే అధికారంలోకి వస్తాం అనే కాంగ్రెస్‌కు కాని బీజేపీకి గానీ రాష్ట్రం మీద ఒక విజన్, ఒక ప్రణాళిక ఏదైనా ఉందా? రాష్ట్రం ప్రధాన అవసరాలేమిటి? వాటిని ఎలా సాధించాలనే అవగాహన అయినా ఉందా? కేసీఆర్ లక్ష మాఫీ అంటే మేం రెండు అని ఒకరు.. మేం వస్తే అధికారికంగా సెప్టెంబర్ 17 అని ఇంకొకరు! గాలిమాటలు తప్ప గోదావరినో కృష్ణానదినో తెలంగాణ బీళ్లకు ఎలా మళ్లించాలి? ఏయే జిల్లాల్లో ఎంత నీరు అవసరం? వంటి అంశాలు తెలుసా? నల్లగొండ ఫ్లోరైడ్‌కు కాంగ్రెస్ చెప్పిన పరిష్కారం ఏమిటి? కేసీఆర్ చేస్తున్న పరిష్కారమేమిటి? కనీసం ఆ దరిదాపుల్లోనైనా రాష్ర్టాన్ని అనేక ఏండ్లు పాలించిన కాంగ్రెస్ నాయకు లు ఆలోచన చేయగలిగారా? మరి కేసీఆర్‌ను గద్దె దింపి అధికారంలోకి వచ్చి ఏం చేస్తారు? గతంలో మీ పాలనలో ఏం చేశారు?ఏదైనా కొత్తగా చేయగలిగేది ఉందా? ఎన్నికలు జరిగి ఏడాది కాలేదు. అపుడే కేసీఆర్ మీద ప్రజలకు విశ్వాసం పోయిందట. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనట. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ ఉవాచ. అసలు వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ ఉంటదో ఉండదో తెలియదు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడెవరో తెలియని పరిస్థితి. అన్ని రాష్ర్టాల్లో పార్టీ ఖాళీ అవుతుంటే, ఉప ఎన్నిక తర్వాత పదవిలో ఉంటారో ఉండరో తెలియని అధ్యక్షుడు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆరు దశాబ్దాల్లో దేశ రాజకీయాలకు వామపక్షాలు కొన్ని పడికట్టు పదాలు అందించాయి. నియంత, హిట్లర్, కుటుంబ పాలన, వ్యక్తిపూజ, నియంతృత్వం.. వగైరా.. వాటిని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వల్లె వేస్తున్నారు. దేశంలో నియంత పాలన ఏ పార్టీ నేత హయాంలో జరిగిందో ఒకసారి తెలుసుకుంటే బాగుండు.
 
పాపం రేవంత్‌రెడ్డికి విద్యుత్‌శాఖ అంపశయ్య మీద ఉన్నట్టు కలవస్తుంది. ఏదైనా జరిగి 24 గంటల కరెంటు భగ్నం కాకపోతుందా? అనే ఆశ. అయితే అది నెరవేరే అవకాశమే కనిపించడం లేదు.కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయినా కాంగ్రెస్ నేతల ఆత్మలు మాత్రం ఇంకా తమ్మిడిహట్టి దగ్గరే తిరుగుతున్నాయి. పొన్నాలకైతే కాళేశ్వరం ఇంజినీరింగ్ తప్పిదంలాగా కనిపిస్తుంది. కాని ఇవాళ ఆ కాళేశ్వరం బ్యారేజీల్లోనే అరువై టీఎంసీల నీరు నిల్వ ఉంది. అదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే వరదకాల్వలో గోదావరి రివర్స్ పంపింగ్ జరిగి శ్రీరాంసాగర్ గేటును తాకుతున్నది. ఇవేవీ గమనించరు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతకు హద్దే లేదు. వమో వృద్ధులకు మరో జీవితాన్ని ఇచ్చిన పథకం కంటివెలుగు. దానిమీదా మీడియా గాలికథనాలు అసెంబ్లీలో ప్రస్తావించి బురద చల్లాలనే యత్నం. ఇక హుజూర్‌నగర్‌లో గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్లి ఏం సాధిస్తారో మరి.
 
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఉండాలి. అవి నిర్మాణాత్మకంగా పనిచేయాలి. రాజకీయాలు ఎక్కడ చేయాలనే విచక్షణ పాటించాలి. రాష్ట్ర ప్రయోజనాల అంశంలో ఏకోన్ముఖంగా నిలబడాలి. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు అది కొరవడింది. ఆర్టీసీ సమ్మె విషయంలోనూ కాంగ్రెస్ బీజేపీల వైఖరి ఇలాగే ఉంది. దేశంలో విమాన రవాణా జలరవాణా ప్రజా రవాణా వరకు అన్ని రాష్ర్టాల్లో ప్రత్యేక సంస్థల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. తమ రాష్ర్టాల్లో ఎక్కడా విలీనం చేయని పార్టీలు ఇక్కడ మాత్రం విలీనం చేయాలని గొంతెత్తి అరుస్తున్నాయి. దేశంలో తీవ్ర ఆర్థికమాంద్యం ఉంది. కేంద్రం ఆర్‌బీఐ దగ్గర రిజర్వ్‌లో ఉన్న లక్షకోట్లను లాగేసుకుంటే తప్ప ఆర్థికంగా నిలబడలేని పరిస్థితి. అన్నిరంగాల్లో వేగం మందగించింది. వసూళ్లు పడిపోతున్నా యి. రాష్ట్రంలోనూ ఈ ప్రభావం ఉంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు తగ్గిపోయాయి. కేంద్ర పథకాలకు కత్తెర పడుతూ ఆ భారం రాష్ట్రం మోయాల్సిన పరిస్థితి ఉం ది. మాంద్యం నేపథ్యంలో ప్రభుత్వం తన బడ్జెట్‌ను తానే కత్తిరించుకుంది. అనేక శాఖలకు కేటాయింపులు కుదిస్తున్నది. కొత్త పథకాలు వాయిదా వేసుకుంటున్నది. ఆర్థికంగా కటకట ఉందని చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నదని, రైతుబంధు నిధులు విడుతలుగా ఖాతాల్లో పడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితి నెలకొన్న సమయంలో ఆర్టీసీ విలీనం సాధ్యమా? ఒకేసారి యాభైవేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడం, ఆర్టీసీ నష్టాలను తలకెత్తుకోవడం అయ్యేదేనా? ప్రభుత్వంలో విలీనం అంటే బస్సు బొమ్మ తీసి ప్రభుత్వ ముద్ర వేయటం కాదు. ప్రభుత్వ కేడర్‌కు సరిపడా జీతాలు పెంచడం కూడా. ఒక అంచనా ప్రకారం- విలీనం చేయాల్సివస్తే కనీస పక్షం నాలుగు వేల నుంచి గరిష్ఠం ఇరువై వేలకు పైగా జీతాలు పెంచాల్సి వస్తుందని అంటున్నారు. ఈ మాంద్యం సమయంలో ఇలాంటి డిమాండ్ అమలు ఏ ప్రభుత్వానికైనా సాధ్యమేనా అనేది ఈ పార్టీలకే తెలియాలి.
 
నక్కా నక్కా నీ వైభవం ఎందాక అంటే నాలుగు బొక్కలు కంకేదాక అన్నదట.. గెలుస్తామని గట్టిగా చెప్పే ఒక్క అసెంబ్లీ సీటు కూడా లేని రాష్ట్ర బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందట. అమిత్ షా ప్లాన్ వేస్తున్నాడట. రంగంలోకి దిగితే అయిపోయినట్టేనట. కేంద్రంలో తమ పార్టీ ప్రభుత్వముందనే అహంకారంతో విర్రవీగుతున్నది. మాటలు కోటలు దాటుతున్నయి. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఒకరు, కేసీఆర్‌ను జైల్లో పెడుతామని ఇంకొకరు ప్రగల్భాలు పలుకుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మాటలకు హద్దే లేదు. కరెంటు కొనుగోళ్లలో స్కామ్ అంటారు. కాళేశ్వరంలో స్కామ్ అంటారు. ఆ మధ్య జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి సభలోనైతే ఆయన ఆవేశం హద్దులు దాటేసింది. అయిపోయింది రేపే టీఆర్‌ఎస్ నాయకులు మా పార్టీలో చేరుతున్నారని ఊరించడమే కానీ వాళ్లు చేరిందీ లేదు. ఆఖరుకు అడ్రస్‌లేని నలుగురు నాయకులు పార్టీలో చేరగానే అధికారం వచ్చేసినట్టుగా కలలు గంటున్నారు. వట్టిపోయిన నాలుగు ఆవులు గోశాలలో చేరితే ఒరిగేదేంటి? ఇంకో మోపెడు గడ్డి దండుగ తప్ప! ఇక కేంద్రమంత్రి గారికైతే తెలంగాణ మొత్తం ఐఎస్‌ఐలు తాలిబన్లే కనిపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 20 వేల ఓట్లుకూడా రాని ఆ పార్టీ అధికార వాచాలుని ఆరోపణలకు అంతేలేదు. తెలంగాణ ఉద్యమకారులను టీఆర్‌ఎస్ విస్మరించిందట. ఒక్కరంటే ఒక్కరికి కూడా ఏ పదవీ ఇవ్వలేదట. పార్టీ జెండా మోసిన వారికి టీఆర్‌ఎస్‌లో చోటే లేదట. మరి రెండు సీట్ల బీజేపీ ని ఎనభై సీట్లకు తెచ్చిన అద్వానీకి ఇవాళ బీజేపీలో ఉన్న చోటేమిటో. ఏకాత్మతాయాత్ర చేపట్టి ఉగ్రవాదుల హెచ్చరికలు లెక్కచేయకుండా శ్రీనగర్ నడిబొడ్డున జాతీయ జెండా ఎగరేసిన మురళీమనోహర్ జోషి ఎక్కడున్నారో.. రామాలయ వివాదంలో పదవి వదులుకున్న కళ్యాణ్‌సింగ్‌కు పార్టీ ఇచ్చిన గౌరవం ఏమిటో ఆయనే చెప్పాలి. రాష్ట్రంలో తీసుకున్నా ముఫ్పై ఏండ్లు పార్టీ జెండా మోసిన పాలమూరు నాయకులను పక్కనబెట్టి అర్ధరాత్రి చేరిన అరుణకు తెల్లారి టికెట్ ఇచ్చిన నాయకులు ఎదుటి పార్టీకి సుద్దులు చెప్తున్నారు. సమిష్టి నాయకత్వానికి ప్రతీకగా ఉన్న బీజేపీ ఇవాళ ఇద్దరు వ్యక్తుల సొంత వ్యవహారంగా మారిందని పార్టీ వర్గాలే ఘోషిస్తుంటే.. పార్టీకి ఆక్సిజన్ అందించే నాగపూర్ పెద్దలు కూడా గత ఐదేండ్లలో హిందూ ఎజెండా విస్మరించిన అంశంమీద అసంతృప్తిగా ఉన్నందువల్లనే వారి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు చేపట్టిన చర్యలే కాశ్మీర్ తాజా పరిణామాలని ఢిల్లీ మేధావుల్లో చర్చ జరుగుతున్న విషయం ఈయనకు తెలిసి ఉండకపోవచ్చు. పార్టీని ఏక వ్యక్తికేంద్రంగా మార్చడం మీద, పార్టీలో మరెవరినీ ఎదుగకుండా తొక్కేయడం మీద కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. స్మృతి ఇరానీ దేశాన్ని ఉర్రూతలూగించే ఒక్క ప్రసంగం చేసినందుకు ఆమెను పూర్తిగా పక్కనపెట్టేశారనే వాదనా బీజేపీ వెటరన్స్ నుంచి వినిపిస్తున్నది. బీజేపీ గురివిందలకు ఇది తెలిసినట్టు లేదు.
 
ఒక్క సీటు గెలుపు లేదా ఓటమి అనేది రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేయలేవు. కానీ ప్రజల కోసం పనిచేసే ఏ ప్రభుత్వానికైనా గెలుపు ఒక టానిక్ లాంటిది. ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేసే ఒక ఉత్ప్రేరకం. రాష్ట్రం ఈ అభివృద్ధి పంథాను ముందుకు తీసుకువెళ్లాలా? లేక అడుగడుగునా అడ్డుపడే శక్తులకు ఊతమివ్వాలా అనేది ఇవాళ హుజూర్‌నగర్ ప్రజల ముందున్న ప్రశ్న.
 
By: ఎస్.జి.వి. శ్రీనివాస రావు