మారుమూల గ్రామాలకు రహదారులను నిర్మించేందుకు రోడ్లు భవనాలు, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో రహదారుల అభివృద్దిపై ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, అటవీ శాఖల అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శనివారం అరణ్య భవన్ లోని మంత్రి చాంబర్ లో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, పీసీసీఎఫ్ ఆర్. శోభ పాల్గొన్నారు. చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో రోడ్ల పరిస్థితిపై ఎమ్మెల్యేలు మంత్రికి వివరించారు. కొన్ని చోట్ల పాత రోడ్ల విస్తరణకు అటవీ శాఖ అధికారుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయని వారు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణకు నిర్ధేశించిన అటవీ చట్టాలకు విఘాతం కలగకుండా అన్ని గ్రామాలకు రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలను మెరుగుపరిచేందుకు రోడ్ల నిర్మాణం ఎంతో ఆవశ్యకమని ఆయన చెప్పారు. ఇందుకుగాను ఇప్పటికే ఉన్న రహదారులను అనుసంధానం చేస్తూ మారుమూల గ్రామాలకు రోడ్లను నిర్మించేందుకు అలసత్వం చేయరాదని స్పష్టం చేశారు. రహదారులు లేని గ్రామాలకు రోడ్లను నిర్మించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్బంగా తెలిపారు. అడవులకు ఎటువంటి నష్టం లేకుండా మారుమూల గ్రామాలకు నిర్మించే రహదారులను ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, అటవీ శాఖల అధికారులు పరిశీలించాలని సూచించారు. అయితే అటవీ ప్రాంతంలో రోడ్లను నిర్మించేందుకు సంబంధిత శాఖల అధికారులు చేసే ప్రతిపాదనల దశలోనే అటవీ శాఖ అధికారులతో సంప్రదించాలని చెప్పారు. అటవీ అనుమతుల అంశపై అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో ఇరు శాఖల అధికారులు పనిచేయాలని తెలిపారు. అధికారులు ఎటువంటి జాప్యం లేకుండా అనుమతులు పొందేందుకు కృషి చేయాలని చెప్పారు. అటవీ శాఖ అభ్యంతరాలు ఉన్న రహదారుల నిర్మాణ విషయమై సమగ్ర సర్వే నిర్వహించి తగిన సాంకేతిక వివరాలతో మ్యాపులను తయారు చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాల్నారు. ఈ సమావేశంలో సీసీఎఫ్ వినోద్ కుమార్, మంచిర్యాల, చెన్నూర్ ఎఫ్ డీవోలు నాగభూషణం, రాజారావు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.