ప్రపంచ దేశాల్లోనే భారత రాజ్యాంగానికి విశిష్టత ఉందని, లివింగ్ డాక్యుమెంట్ భారత రాజ్యాంగమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మహాత్మా గాంధీ లా కాలేజీలో జరిగిన ‘ 70 వసంతాల భారత రాజ్యాంగం ‘ అనే సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ సమకాలీన పరిస్థితుల్లో భారత రాజ్యాంగం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తట్టుకొని నిలిచిందని అన్నారు. భారత రాజ్యాంగం చాలా గొప్పదని, స్వాతంత్ర్య పోరాటాల్లో అప్పటి పరిస్థితులను ఆకళింపు చేసుకున్న సందర్భంలో రాజ్యాంగాన్ని రచించారని ఆయన వివరించారు. పరిస్థితులకు అనుగుణంగా 103 సవరణలు జరిగాయని అన్నారు. దేశ ప్రజలకు రాజ్యాంగం పట్ల సంపూర్ణ విశ్వాసం ఉందని, అందుకే రాజ్యాంగానికి ఆ గౌరవం లభిస్తుందన్నారు. ప్రజలు తమ ప్రాథమిక హక్కుల కోసం ప్రాంతాలకు అతీతంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకరీతిన స్పందించారని, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తే ప్రజలు ఆమెను ఓడించారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. జైల్లో పుట్టిన జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టారని ఆయన అన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని , రాజ్యాంగం, అంబెడ్కర్ స్ఫూర్తితో తెలంగాణ ఏర్పాటుకు కారణమని ఆయన అన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం వల్లే తెలంగాణ కు మార్గం సుగమం అయిందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ను ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధిస్తున్న సందర్భంగా 1994లో అప్పటి కర్నాటక సీఎం ఎస్సార్ బొమ్మయి ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సవాలు చేయగా రాజ్యాంగం ప్రకారం గవర్నర్ ల అధికారాలు, వారి పరిధిని నిర్ణయించారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. మన రాజ్యాంగం అత్యంత విలువైనదని, రాజ్యాంగానికి ఇబ్బంది కల్గించ వద్దన్నారు. ఆర్టికల్ 368 ప్రకారం భవిష్యత్ తరాలు ఎలా బతకాలి అని ఎవరూ నిర్ధేశించలేరని ఆయన అన్నారు. రాజ్యాంగ స్పూర్తితో దేశం కోసం పునరంకితం కావాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.
రాజ్యాంగ స్పూర్తితో రాష్ట్రాలు బలంగా ఉండాలని, రాష్ట్రాలు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందని అన్నారు. ప్రాంతీయ భాషలకు రాజ్యాంగం ప్రాధాన్యత ఇచ్చిందని, రాజ్యాంగంతోనే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని ఆయన వివరించారు. రాజ్యాంగం ప్రకారం మాతృ భాషను విస్మరించారాదని అన్నారు. ఇంగ్లీష్ వస్తేనే చదువు వస్తుంది అన్నది కరెక్ట్ కాదని ఆయన తెలిపారు. యూరప్, జర్మనీ వంటి దేశాలలో ఇంగ్లీష్ రాదని, వారి స్థానిక భాషను వాడుతున్నారని ఆయన గుర్తు చేశారు. మాతృభాష రాజ్యాంగ హక్కు అని ఆయన అన్నారు. మహారాష్ట్ర లో గవర్నర్ తన అధికారాన్ని అతిక్రమించారని, రాజ్యాంగ పరిధిని మించి ప్రవర్తించారని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ లో నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్ కమిషన్ బిల్లును ప్రవేశ పెట్టాలని ఆయన కోరారు.