డాక్టర్ ప్రియంకా రెడ్డి హత్య కేసు విచారణను వేగంగా చేపట్టి దోషులకు కఠినంగా శిక్షపడేలా స్పెషల్ కోర్టుని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించిన నేపథ్యంలో ….ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటుపై హైకోర్టుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటైన వెంటనే రోజు వారీ పద్దతిలో విచారణ జరిపి నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు వల్ల బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుపై న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డితో మంత్రి ఫోన్లో మాట్లాడారు.
