నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పసుపు బోర్డు విషయంలో పసుపు బోర్డు 5 రోజుల్లో తెస్తామని బాండ్ రాసిచ్చి రైతులను తప్పుదోవ పట్టించారని అన్నారు. పసుపు బోర్డు తెస్తానని రైతులను మభ్యపెట్టి గెలిచారని విమర్శించారు. రైతుల దృష్టిలో అరవింద్ మోసగాడిలా మారిపోయారన్నారు. అరవింద్ తక్షణమే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఎంపీ ధర్మపురిపై చీటింగ్ కేసు నమోదు చేయాలి అని అన్నారు. మాజీ ఎంపీ కవిత పసుపు బోర్డు విషయంలో రాజీ లేని పోరాటం చేశారు అని పేర్కొన్నారు. నాణ్యత,మార్కెటింగ్,ఉత్పత్తి విషయంలో రివ్యూలు నిర్వహించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పసుపుపై స్టడీ చేసిన ఘనత మాజీ ఎంపీ కవితది అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. కాగా పసుపు రైతులకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నామని, పసుపు రైతులకు బోర్డు కన్నా మంచి పరిష్కారం కోసం కేంద్రం నిర్ణయం తీసుకుందని అరవింద్ చెప్పిన విషయం తెలిసిందే.
