Home / BUSINESS / గ‌త మార్చి బిల్లు క‌ట్టండి చాలు

గ‌త మార్చి బిల్లు క‌ట్టండి చాలు

క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. 2019 మార్చిలో వచ్చిన కరెంట్ బిల్లునే ఈ నెల ఆన్‌లైన్‌ ద్వారా క‌డితే సరిపోతుందని క‌స్ట‌మ‌ర్ల‌కు తెలియజేసింది.

గ‌త మార్చి బిల్లు వివరాలను విద్యుత్ పంపిణీ సంస్థలు ఎస్ఎంఎస్‌ల ద్వారా క‌స్ట‌మ‌ర్ల‌కు పంపిస్తాయ‌ని, దాని ప్రకారం ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లిస్తే చాల‌ని టీఎస్ఈఆర్సీ తెలిపింది.

లాక్ డౌన్ కారణంగా మీటర్ రీడింగ్ తీసుకునే అవకాశం లేక‌పోవ‌డంతో డిస్కంలకు ఈ వెసులుబాటు కల్పిస్తూ టీఎస్ఈఆర్సీ నిర్ణ‌యం తీసుకుంది. లాక్‌డౌన్‌ ముగిసిన తరువాత ఇంటింటికీ వెళ్లి మీటర్ రీడింగ్ ఆధారంగా బిల్లులు ఇస్తార‌ని, అప్ప‌టివ‌ర‌కు ఆన్‌లైన్‌లో క‌ట్టిన సొమ్మును ఆ బిల్లుల్లో స‌ర్దుబాటు చేస్తార‌ని టీఎస్ఈఆర్సీ తెలిపింది.

లాక్‌డౌన్‌ తర్వాత ఒకేసారి మూడు నెల‌లకు ఒకేసారి రీడింగ్ తీసినా క‌స్ట‌మ‌ర్ల‌పై అద‌న‌పు యూనిట్ల భారం ప‌డ‌ద‌ని, ప్ర‌తి నెల 30 రోజుల స‌గ‌టు ప్ర‌కార‌మే బిల్లులు వ‌చ్చేలా స‌ర్వ‌ర్ల‌లో మార్పులు చేస్తామ‌ని ద‌క్షిణ డిస్కం సీఎండీ ర‌ఘురాంరెడ్డి చెప్పారు.