కాళేశ్వర ప్రాజెక్టు మహోజ్వల ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కారమవుతున్నది. నాలుగేండ్ల క్రితం మేడిగడ్డ వద్ద వెనుకకు అడుగులు వేయడం మొదలుపెట్టిన గోదావరి.. రంగనాయకసాగర్‌లో కాలుమోపడంతో సప్తపదులు పూర్తిచేసుకోనున్నది. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి ఆరోదశ ఎత్తిపోతతో అన్నపూర్ణ జలాశయాన్ని చేరుకున్న గోదావరిజలాలు.. రంగనాయకసాగర్‌లోకి వస్తున్నాయి.
పది దశల ఎత్తిపోతలలో ఏడోదశ సంపూర్ణం కాబోతున్నది. శుక్రవారం చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ శివారులోని రంగనాయకసాగర్ పంప్‌హౌజ్‌లోని నాలుగుమోటర్లలో ఒక మోటర్ వెట్ రన్ ప్రారంభించనున్నారు. దీంతో సిద్దిపేట జిల్లాలోని బీడుభూములను గోదావరి జలాలతో తడుపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన భగీరథ యజ్ఞం ఫలించినట్లవుతున్నది.
అసాధ్యమనుకొన్నదాన్నిసుసాధ్యం చేయడంద్వారా సీఎం కేసీఆర్ తమ సాగునీటి కష్టాలను తీర్చారని రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు కష్టం ఫలించి పొలాలన్నీ కాళేశ్వరం జలాలతో తడుస్తాయని సంబురపడుతున్నారు. మొగులుకు ముఖం పెట్టి వానకోసం ఎదురుచూసే రోజులు పోతున్నాయని, ఇక రెండు పంటలకు నీళ్లు వస్తాయని ఆశిస్తున్నారు.