సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
అనంతరం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట పేరులోనే ఏదో బలం ఉంది అని సీఎం అన్నారు. ఇది మాములు పేట కాదన్నారు. ఎందుకంటే ఇది సిద్ధి పొందినటువంటి పేట అని ప్రసిద్ధి. తెలంగాణను సిద్ధింపజేసిన గడ్డ. సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని సీఎం అన్నారు.
ఆనాడు అవసరం రీత్యా కరీంనగర్ ఎంపీగా, సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీచేస్తే రెండింటిలో గెలిచాం. కానీ తెలంగాణ కోసం ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఏర్పడింది. తెలంగాణ కోసం నడుం కట్టి మిమ్మల్ని అందరినీ వదిలి అక్కడికి పోయిన. మీ పేరు నిలబెట్టి తెలంగాణ తెచ్చి ప్రజల చేతులో పెట్టాం. తెలంగాణనే కాదు మన సిద్దిపేటకు నా అంత పనిచేసే మనిషి కావాలని చెప్పి మంచి ఆణిముత్యం లాంటి నాయకుడిని హరీశ్‌రావు మీకు అప్పగించా. నా పేరు కాపాడి అద్భుతమైన సిద్దిపేట తయారు చేశాడు. ఇది తన గుండెల నిండా సంతోషం నింపే అంశమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.