తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1400 రేషన్ షాపులకు త్వరలో డీలర్లను నియమిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరచి ప్రజలకు, రేషన్ డీలర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
ముషీరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం, నూతన సంవత్సర క్యాలెండరు ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు అధ్యక్షత వహించారు.
మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 వేల రేషన్ షాపులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. రేషన్ డీలర్లకు ఇతర రాష్ట్రాల మాదిరిగా కమీషన్ డబ్బులు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రేషన్ డీలర్లకు రూ. 58 కోట్ల బకాయిలు చెల్లించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డీలర్లకు రావాల్సిన రూ. 160 కోట్ల కమీషన్ అందనప్పటికీ నిబంధనలు సడలించి ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించిందని మంత్రి తెలిపారు.