వ్యవసాయం, విద్యుత్తు, నీటిపారుదలరంగాల్లో తెలంగాణ ఎంతో ప్రగతిని సాధించిందని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ప్రశంసించారు. రాష్ట్రంలో 31 జిల్లాల్లో పర్యటించిన ఆయన గురువారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రగతిపై సమాలోచనలు చేశారు.
కరోనా అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయని ఫ్లెమింగ్ అడిగి తెలుసుకున్నారు. తాను స్వయంగా స్థానికంగా పర్యటించి, అమలవుతున్న అనేక కార్యక్రమాలపై సమగ్ర వివరాలు తెలుసుకున్నానని చెప్పారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. అర్ధ గణాంక, ప్రణాళికశాఖ రూపొందించిన రాష్ట్ర గణాంకాల అబ్‌స్ట్రాక్ట్ పుస్తకాన్ని ఫ్లెమింగ్‌కు అందజేశారు.
ఈ భేటీలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ పొలిటికల్ ఎకానమీ సలహాదారు నళిని రఘురామన్ పాల్గొన్నారు. భేటీ అనంతరం ఫ్లెమింగ్‌తో రాష్ట్ర ప్రగతికి సంబంధించి ఆలోచనలు పంచుకున్నందుకు ఆనందంగా ఉన్నదని వినోద్‌కుమార్ ట్వీట్‌చేశారు. దీనికి ప్రతిగా ఫ్లెమింగ్ ‘మీ ఆతిథ్యం, రాజకీయ ప్రయాణం ప్రశంసనీయం. మీతో చర్చించిన అన్ని అంశాలు బాగున్నాయి’ అని కృతజ్ఞతలు తెలుపుతూ రీట్వీట్‌చేశారు.