శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రియ భక్తుడు శ్రీ తాళ్ళ పాక అన్నమాచార్యులు స్వామి వారిని కీర్తిస్తూ రాసిన కీర్తనలకు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని టీటీడీ నిర్ణయించిందని చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.తిరుమల అన్నమయ్య భవన్ లో శుక్రవారం ఆయన ఇందుకు సంబంధించిన ప్రోమో లను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్నమయ్య సంకీర్తనలకు బహుళ ప్రాచుర్యం కల్పించేందుకు ” ఆదివో అల్లదివో ” పేరుతో తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, బెంగుళూరు నగరాల్లోని యువతకు అన్నమయ్య సంకీర్తనలపై పోటీలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
తొలుత జిల్లాస్థాయిలో,ఆ తరువాత రాష్ట్రస్థాయిలో యువతకు పోటీలు నిర్వహిస్తామని చైర్మన్ వివరించారు.టిటిడి రికార్డు చేసిన 4 వేల సంకీర్తనల నుంచే ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.తద్వారా యువతను భక్తి మార్గంలో నడిపించేందుకు ఇదొక వేదిక అవుతుందని ఆయన చెప్పారు.ఇందులో భాగంగా తొలుత చిత్తూరు జిల్లాకు చెందిన 15 నుంచి 25 సంవత్సరాల వయస్సులోపు ఉన్న గాయనీ, గాయకులకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.శుక్రవారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆసక్తి కలిగిన గాయనీ గాయకుల నుంచి ఎస్వీబీసీ వెబ్సైట్ లోను, నేరుగాను దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు.
దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 25 , 26 వ తేదీల్లో ఎస్వీబీసీ కార్యాలయంలో సెలెక్షన్స్ నిర్వహిస్తారని శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. నేరుగా రాలేని వారికి 27వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జూమ్ ద్వారా సెలెక్షన్స్ జరుగుతాయన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎస్వీబీసీ కన్నడ, హింది చానళ్ళు ప్రారంభమవుతాయనీ, ఈ చానళ్ల ద్వారా కూడా పోటీలు నిర్వహిస్తామని చెప్పారు.టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, ఎస్వీబీసీ చైర్మన్ శ్రీ సాయి కృష్ణ యాచెంధ్ర, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు