దిల్లీ: ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో షాక్ ఇచ్చింది. వడ్డీరేటును తగ్గించాలని నిర్ణయించింది. 2021-2022 ఫైనాన్సియల్ ఇయర్‌కు పీఎఫ్‌పై 8.1 శాతం వడ్డీరేటు ఇవ్వనుంది. ఈ మేరకు ఈరోజు నిర్వహించిన ఈపీఎఫ్‌వో బోర్డు (సీబీటీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2020-2021 ఫైనాన్సియల్ ఇయర్‌లో ఈ వడ్డీ 8.5 శాతం ఉండగా ఇప్పుడు దాన్ని 8.1 శాతానికి తగ్గించనున్నారు.
ఈపీఎఫ్‌పై ఇంత తక్కువ వడ్డీ రేటు చెల్లించడం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారి. 1977-1978 ఫైనాన్సియల్ ఇయర్‌లో 8.1 శాతం ఇచ్చారు. ఆ తర్వాత క్రమంగా దాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఓ దశలో వడ్డీరేటు 8.8 శాతం (2015-2016) కూడా చెల్లించారు. ఆ తర్వాత మళ్లీ తగ్గుతూ వచ్చింది.
2019-2020 ఆర్థిక సంవత్సానికి 8.5 శాతం చెల్లించగా.. కొవిడ్ పరిస్థితులతో 2020-2021 ఆర్థిక సంవత్సరంలోనూ అదే రేటును కొనసాగించారు. ఇప్పుడు మరింత తగ్గిస్తూ 8.1 శాతంగా నిర్ణయించారు. ఈపీఎఫ్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థికశాఖకు పంపనున్నారు. అక్కడ ఆమోదం లభించిన తర్వాత చందాదారుల అకౌంట్లలో 8.1 శాతం వడ్డీని లెక్కించి జమ చేయనున్నారు.