మతిస్థిమితం లేని ఓ 40 ఏళ్ల వ్యక్తి తీవ్ర కడుపునొప్పితో అల్లాడిపోయాడు. అతని బాధను బయటకు చెప్పుకోలేక, నొప్పి తట్టుకోలేక విలవిల్లాడిపోయాడు. గుర్తించిన కుటుంబసభ్యులు హుటాహుటిన హాస్పిటల్‌కు తీసుకెళ్లాగా సిటీ స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్ల మైండ్ బ్లాంక్ అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
గుజరాత్ వీరావల్‌లోని మాల్‌దా ప్రాంతానికి చెందిన అర్జున్ చంద్బాకు పుట్టుకతోనే మతిస్థిమితం లేదు. మాట్లాడలేడు. చెవులు సరిగా వినపడవు. దీంతో కుటుంబమే అన్నీ అయి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఈమధ్య అర్జున్ చంద్బా ముభావంగా ఉంటున్నాడు. అప్పుడప్పుడు కడుపు పట్టుకొని విలవిల్లాడిపోతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని జునాగఢ్ గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. సిటీస్కాన్ చేసిన డాక్టర్లు అతడి కడుపులో అనేక వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే 2 గంటలపాటు ఆపరేషన్ చేసి 15 ప్లాస్టిక్ స్ట్రాలు, 2 హెన్నా కోన్‌లు, 62 చెక్కముక్కలు బయటకు తీశారు. ఇవన్నీ చంద్బా కడుపులో గడ్డలా పేరుకున్నాయి. మతిస్థిమితం లేనందునే వీటిని మింగేశాడని డాక్టర్లు తెలిపారు.