ఏ పని చేసినా ఆచితూచి చేయమంటారు పెద్దలు. ఏదో చేయాలని ఓవరాక్షన్ చేస్తే మొదటికే నష్టం జరుగక తప్పదు. ఇలాంటి ఘటనే ఒకటి వినాయక మండపంలో జరిగింది. ఓ వ్యక్తి తన విన్యాసాలతో అందర్ని ఆకట్టుకోవాలని చివరికి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
వినాయకచవితి సందర్భంగా సూరత్‌లోని పర్వతా పాటియా ప్రాంతంలో కొందరు యువకులు గణనాథుణ్ని మండపంలో కొలువుతీర్చేందుకు విగ్రహాన్ని తీసుకొస్తూ ఆనందంగా డ్యాన్సులు చేశారు. అందులో ఓ యువకుడు మాత్రం అందర్ని ఆకట్టుకోవాలని అత్యుత్సాహంతో ఏకంగా పెట్రోల్ నోటిలో పోసుకొని అగ్ని మీద వెదజల్లే స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు. అది కాస్త బెడిసికొట్టి అతడి ప్రాణాలమీదకు వచ్చింది. పెట్రోల్ అగ్గి మీద ఉమ్మే క్రమంలో అతడి శరీరం మీద పడింది. దీంతో తన మీదకు మంటలు వ్యాపించాయి. వెంటనే సమీపంలో ఉన్న మరోవ్యక్తి మంటల్లో చిక్కుకున్న వ్యక్తి టీ షర్టును చించేసి మంటల వ్యాప్తిని అదుపుచేయడంతో పెను ప్రమాదమే తప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.