బిహార్ నలందలోని ఓ వినాయకుడిని ఏడాదంతా పోలీసు స్టేషన్‌లోనే ఉంచుతారు. కేవలం వినాయక చవితి వేడుకలకు మాత్రం బయటకు తీసుకొస్తారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమే. భక్తుల్ని కాపాడాల్సిన దేవుడు జైలు కెళ్లడం ఏంటని ఆలోచిస్తున్నారు. అయితే ఇది తెలుసుకోండి..
నలందలోని విగ్నేశ్వరుడి విగ్రహం 150 ఏళ్ల చరిత్ర కలది. పాలరాయితో తయారు చేసిన విగ్రహం కావడంతో దొంగల నుంచి కాపాడేందుకు ఆ గణనాథున్ని 355 రోజులు సిలావ్ పోలీస్ స్టేషన్ ఆవరణంలోని మందిరంలో జాగ్రత్తగా ఉంచుతారు. కేవలం వినాయక చవితికి 10 రోజులు బయటకు తీసుకొచ్చి ఘనంగా వేడుకలు జరుపుతారు. పూజలు తర్వాత మళ్లీ అక్కడే భద్రపరుస్తారు. ఇదివరకు చాలా సార్లు కొందరు ఈ విగ్రహం కాజేయడానికి ప్రయత్నించారు. ఒకసారి దొంగిలించేశారు కూడా. అయితే గ్రామస్థులు దొంగల్ని పట్టుకొని విగ్రహాన్ని దక్కించుకున్నారు. అందుకే భద్రత కోసం ఇలా స్టేషన్‌లో ఉంచుతారట.