తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం శివారులో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా తాడుతో కాళ్లు, చేతులు కట్టేసి, ముఖానికి ప్లాస్టిక్ కవరు చుట్టి నడిరోడ్డు మీద చంపేశారు. స్థానికంగా కలకలం రేపిన ఈ హత్య విషయంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనేక కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.
ఐడీఏ బొల్లారం శివారులోని రింగురోడ్డు సర్వీసు రోడ్డుపై గురువారం తెల్లవారు జామున ఈ హత్య జరిగుంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. రోడ్డుపై వాహనాలు రాని సమయంలో హత్య చేసి ఉంటారా? లేక వేరే ప్రాంతంలో చంపేసి బాడీని ఇక్కడకు తీసుకొచ్చి పడేసుంటారా? ఇంతకీ ఇంత కిరాతకంగా చంపిన వారు ఎవరు? ఎందుకు ఇంత దారుణానికి పాల్పడ్డారు.. అనే విషయాలు పూర్తి విచారణలో తెలుస్తాయని పోలీసులు చెప్పారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తుందని పోలీసులు తెలిపారు. హత్యకు గురైన యువకుడి వయసు 30 ఏళ్ల లోపే ఉంటుందని అంటున్నారు. ప్రేమ వ్యవహారం, ఆస్తి తగాదాల నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.