తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. రాత్రి పూట మంచంపై పడుకున్న ఓ అమ్మాయి సజీవ దహనం అయ్యింది.
ముద్దాపురం గ్రామానికి చెందిన ముళ్లపూడి శ్రీనివాస్, గజ్జరపు వసంత దంపతులు. వీరికి హారిక సంతానం. హారిక బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి మంచం మీద పడుకుండా సజీవ దహనమైంది. అయితే ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతుండగా షార్టు సర్కూట్‌తో ఈ ప్రమాదం జరిగిందని హారిక తండ్రి శ్రీనివాస్, సవతి తల్లి రూప పోలీసులకు తెలిపారు. మరోవైపు హారిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
2003లో హారిక తల్లి వసంత మృతి చెందింది. దీంతో 2009లో శ్రీనివాస్ రూపను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక శ్రీనివాస్ మొదటి భార్య వసంతకు పుట్టింటి నుంచి ఆస్తి రావాల్సి ఉంది. ఈ విషయమై కోర్టును ఆశ్రయించారు. అయితే ఆస్తి తమకు వస్తుందనే హారికను సవతి తల్లి, తండ్రి ప్రేమగా చూసేవారని, ఎప్పుడైతే ఆస్తి తమకు రాదని, తీర్పు తమకు అనుకూలంగా రాదని అర్థమైందో అప్పుడు హారికను చంపేందుకు కుట్ర పన్నారని, అందుకే ఆమెను హత్య చేసి షార్ట్ సర్కూట్‌గా చిత్రీకరించారని హారిక మేనమామ, అమ్మమ్మ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం హారిక తల్లిదండ్రులను పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.