తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలలో దారుణం చోటు చేసుకుంది. తమను కాదని కూతురు ప్రేమ వివాహం చేసుకుందని కోపంతో కన్న తల్లిదండ్రులు ఆమెను బుజ్జగించి ఎన్నో విధాలుగా చెప్పినా ఆమె వినకపోయేసరికి తీవ్రంగా వేధించారు. చివరకు కన్నకూతురని చూడకుండా గుండు కొట్టించారు.
జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం బాలపల్లికి చెందిన జక్కుల మధు, రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన జువ్వాజి అక్షిత ప్రేమించుకున్నారు. ఇంట్లో విషయం చెప్పగా యువతి తల్లిదండ్రులు వారి వివాహానికి నిరాకరించారు. దీంతో ఇద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. మధు తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించడంతో అక్షిత అత్తింటికి చేరుకుంది. విషయం తెలుసుకున్న అక్షిత తల్లిదండ్రులు ఆదివారం సాయంత్రం రెండు కార్‌లలో వచ్చి అక్షిత అత్తింటివారిపై దాడి చేసి ఆమెను తమతో పాటు తీసుకెళ్లిపోయారు. ఆమె కేకలు వేయడంతో చికతబాదారు. అనంతరం ఆమెకు గుండు కొట్టించేశారు. దీంతో బాధితురాలు జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. పోలీసులు అక్షితను తన భర్తకు అప్పగించి ఆమె తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.