Cm Kcr : తెలంగాణ సీఎం కేసీఆర్ పిజ్జా, బర్గర్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత దేశంలో యాపిల్ పండుతుంది.. మామిడి కాయ కూడా పండుతుంది. ఇతర దేశాల్లో ఇలాంటి వాతావరణం ఉండదు. కష్టించి పనిచేసే దేశంలోని 130 కోట్ల జనాభాలో మనం తినేది మెక్‌డోనాల్డ్ పిజ్జాలు.. మెక్‌డోనాల్డ్ బర్గార్లా మనం తినేవి ? ప్రపంచానికే అద్భుతమైన ఫుడ్ చైన్ పెట్టి.. అద్భుతమైన పంటలు పండించి.. సాగు నీళ్లు పైకి తెచ్చి దానికి కనెక్టెడ్‌గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు పెట్టి.. అందులో కోటాను కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించి బెస్ట్ ఫుడ్ చైన్ ఆఫ్ వరల్డ్ గా ఉండాల్సినటువంటి.. భారత్ ఇవాళ కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకుంటదా.. ఇంతకన్నా సిగ్గు చేటు ఇంకేమైనా ఉంటదా? లక్ష కోట్ల రూపాయల విలువైన ఫామాయిల్‌ను దిగుమతి చేసుకుంటదా.. ఇంతకన్న సిగ్గు చేటు ఉంటదా” అని కేసీఆర్ అన్నారు.
కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటన తర్వాత ఖమ్మంలో తొలిసారిగా ఈరోజు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ జాతీయ నేత డి.రాజా, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. కాగా ఈ సందర్భంగా నేతలంతా బీజేపీ పై నిప్పులు చెరిగారు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వారి వారి శైలిలో ఫైర్ అయ్యారు.
అలానే బీఆర్‌ఎస్ బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఖమ్మంలోని గ్రామ పంచాయతీలకు వరాలు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో 589 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పెద్దతాండ, కల్లూరు, ఏదులాపురం, తల్లాడ, నేలకొండపల్లి 10 వేల జనాభాకు మించి ఉండి.. మేజర్ గ్రామ పంచాయతీలుగా ఉన్న గ్రామాలకు ఒక్కోదానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం మున్సిపాలిటీ అభివృద్ధికి మరొక రూ.50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీలకు మధిర, వైరా, సత్తుపల్లి కి తలా రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో మంజూరు చేస్తామని ప్రకటించారు.