MINISTER SATYAVATHI: ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ పట్ల వైతెపా అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలను మంత్రి సత్యవతి ఖండించారు. మహబూబాబాద్ పట్టణ బొడ్రాయి పునః ప్రతిష్టాపనలో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, భారాస నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిల……భారాస నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మంత్రి స్పందించారు. నిరాధార ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు మానుకోకపోతే ప్రతిఘటన తప్పదని మంత్రి హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ఉద్యమ కారులపై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించబోమని మంత్రి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని, తెలంగాణలో ఇతర నాయకుల పాలన అవసరం లేదని పేర్కొన్నారు. షర్మిల తెలంగాణలో జెండా ఎగురవేయాలని కలలు కంటోందని విమర్శించారు. పరిమితుల మేరకు పాదయాత్ర చేసుకోవాలని షర్మిలకు మంత్రి సూచించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సంపాదించిన డబ్బుతో వైఎస్ షర్మిల పార్టీని స్థాపించిందని మంత్రి అన్నారు. వైఎస్ పాలనకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం జరిగిందని మంత్రి సత్యవతి గుర్తుచేశారు.
రాష్ట్రంలో ఎలాంటి వారు వచ్చినా ప్రజలు నమ్మరని మంత్రి అన్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమం గురించి అందరికీ తెలుసని అన్నారు. ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు.